india

India : జమ్మూ కాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చీనాబ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో రాంబాన్ జిల్లాలోని బగ్లిహార్ డ్యామ్ రక్షణ కోసం అధికారులు మూడు గేట్లను పైకి ఎత్తారు. దోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల డ్యామ్‌కు వరద నీరు పోటెత్తింది. పరిస్థితిని అదుపు చేయడానికి, నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నది పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలన్నింటినీ అలర్ట్ చేశామని, వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్థానిక యంత్రాంగం ప్రకటించింది.

అయితే, ఈ నీటి విడుదల వెనుక ఒక పెద్ద రాజకీయ వివాదం నడుస్తోంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలకు నిరసనగా, ఆ దేశంతో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ తన ఉగ్రవాద బుద్ధిని మార్చుకుని, నమ్మదగిన చర్యలు తీసుకునేంత వరకు ఈ ఒప్పందం అమలులో ఉండే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ముఖ్యంగా గత ఏడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్ కడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ చేస్తున్న అభ్యంతరాలను కూడా మన దేశం పూర్తిగా తోసిపుచ్చింది.

Also Read : శ్రీలంక జైల్లో రక్తపాతం : 20 మంది మృతి.. 100 మందికి పైగా తీవ్ర గాయాలు!

మరోవైపు, ఈ నదీ జలాల వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా భారత్ అంగీకరించడం లేదు. అసలు ఆ కోర్టు ఏర్పాటు చేయడమే చట్టవిరుద్ధమని, అందువల్ల ఆ కోర్టు చెప్పిన ఏ నిర్ణయాన్నీ తాము పట్టించుకోబోమని భారత్ స్పష్టం చేసింది. నిజానికి ఉగ్రవాదానికి నిరసనగా గత మే నెలలో బగ్లిహార్ డ్యామ్ గేట్లన్నింటినీ భారత్ పూర్తిగా మూసి ఉంచింది. కానీ, ఇప్పుడు ఊహించని విధంగా కురిసిన భారీ వర్షాల వల్ల, కేవలం డ్యామ్ భద్రత కోసం మాత్రమే అధికారులు ఈ గేట్లను తెరవాల్సి వచ్చింది.

1960లో భారత్-పాక్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. సింధు, జీలం, చీనాబ్ నదుల నీరు పాకిస్తాన్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, వాటిపై విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకునే హక్కు భారత్‌కు ఉంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉగ్రవాదం కారణంగా ఈ ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టినప్పటికీ, ప్రకృతి ఇచ్చిన వర్షాల వల్ల డ్యామ్‌లో నీరు ఎక్కువై ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నీటిని కిందకు వదిలారు.

Also Read : అమెరికా ‘పెంటగాన్’కు చెక్.. ఈజిప్ట్‌లో 22,000 ఎకరాల్లో అతిపెద్ద ‘ఆక్టగాన్’ మిలిటరీ హెడ్‌క్వార్టర్స్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.