Microsoft

Microsoft Lay Off :  ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. తమ ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో దాదాపు 2.1 శాతం మందిని, అంటే సుమారు 4,800 మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పెట్టుబడులను భారీగా పెంచుకుంటూ పోతున్న క్రమంలో, వ్యాపారంలో ఖర్చులను తగ్గించుకుని సమర్థతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలన్నీ AI మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే ఈ భారీ పెట్టుబడులకు తగ్గ లాభాలను చూపించాలనే ఒత్తిడి ఆయా కంపెనీలపై పెరుగుతోంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా అమెజాన్, మెటా ప్లాట్‌ఫార్మ్స్ వంటి ఇతర దిగ్గజాలు కూడా ఈ ఏడాది వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. అంచనాల ప్రకారం.. ఈ ఏడాది బిగ్ టెక్ కంపెనీల AI పెట్టుబడులు ఏకంగా 700 బిలియన్ డాలర్లు దాటవచ్చని తెలుస్తోంది.

2026 మొదటి ఆరు నెలల కాలం మైక్రోసాఫ్ట్‌కు తీవ్ర సవాలుగా నిలిచింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కంపెనీ షేర్లు దాదాపు 23 శాతం పడిపోయాయి. 2022 తర్వాత మైక్రోసాఫ్ట్ సాధించిన అత్యంత బలహీనమైన ఆర్థిక ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. పైగా, AI డిమాండ్ కారణంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అజూర్ వృద్ధి చెందుతున్నప్పటికీ, దాని మౌలిక సదుపాయాలైన డేటా సెంటర్ల ఏర్పాటుకు విపరీతంగా ఖర్చవుతోంది. ఇది కంపెనీ నగదు ప్రవాహంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. 2026 సంవత్సరానికి గానూ మైక్రోసాఫ్ట్ సుమారు 190 బిలియన్ డాలర్ల ఖర్చును అంచనా వేసింది, ఇది మార్కెట్ అంచనాల కంటే చాలా ఎక్కువ.

మైక్రోసాఫ్ట్ కేవలం సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాకుండా తన గేమింగ్ బిజినెస్‌లోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. AI డేటా సెంటర్ల డిమాండ్ కారణంగా మెమొరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అదనపు భారాన్ని తట్టుకోవడానికి, అప్పటికే డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ ఎక్స్‌బాక్స్ కన్సోల్ ధరలను మైక్రోసాఫ్ట్ పెంచక తప్పలేదు.

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం కొత్త హెడ్ ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన అంతర్గత లేఖలో.. ఈ విభాగానికి మార్పు అత్యవసరమని పేర్కొన్నారు. ఎందుకంటే గేమింగ్ విభాగం లాభాల మార్జిన్ కేవలం 3 శాతానికి పడిపోయింది. గత ఐదేళ్లలో యాక్టివిజన్ బ్లిజార్డ్ కింగ్ కాకుండా కంటెంట్, హార్డ్‌వేర్ సబ్సిడీల కోసం 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టినప్పటికీ, వార్షిక ఆదాయం మాత్రం అర బిలియన్ డాలర్ల మేర క్షీణించిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.