Gujarat High Court: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు మంగళవారం అత్యంత కీలకమైన, చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ కేసులో 38 మంది ఉగ్రవాదులకు మరణశిక్ష (ఉరిశిక్ష), మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష (జీవితఖైదు) విధిస్తూ 2022లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు పూర్తిగా సమర్థించింది. కింది కోర్టు విధించిన శిక్షలను సవాలు చేస్తూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చిన ధర్మాసనం.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును యథాతథంగా ఖరారు చేసింది. భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతపెద్ద సంఖ్యలో (38 మందికి) ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే మొదటిసారి.

ఆనాడు ఏం జరిగింది? 70 నిమిషాల మారణహోమం: 2008 జులై 26న గుజరాత్‌లోని ప్రముఖ నగరం అహ్మదాబాద్‌ను ఉగ్రవాదులు రక్తాశృవులతో ముంచెత్తారు. శనివారం సాయంత్రం వేళ, ప్రజలంతా రద్దీగా ఉండే సమయాన్ని చూసుకుని కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే నగరంలోని 21 ప్రాంతాలలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. బస్టాండ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, మార్కెట్లు, మున్సిపల్ వాహనాలే లక్ష్యంగా టైమ్ బాంబులను అమర్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దారుణ మారణహోమంలో 56 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, 246 మంది తీవ్రంగా గాయపడి అంగవైకల్యం బారిన పడ్డారు. ఈ దాడులు జరిగిన కొన్ని రోజుల్లోనే సూరత్‌ నగరంలోనూ పేలని పలు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని పెద్ద ప్రమాదాన్ని నివారించారు.

Also Read : Ai+ Pulse 2: రూ.3,099లకే ఏఐ స్మార్ట్‌ఫోన్.. పరుగులు పెడుతున్న కస్టమర్స్.. డోంట్ మిస్..!

పోలీసుల దర్యాప్తు – ఉగ్రసంస్థల కుట్ర బట్టబయలు: ఈ కేసు దర్యాప్తు కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ‘ఇండియన్ ముజాహిదీన్’ (IM), ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ (SIMI) కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూషన్ పక్కా ఆధారాలతో నిరూపించింది. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగానే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’ (UAPA), పేలుడు పదార్థాల చట్టం, ప్రజా ఆస్తి ధ్వంసం చట్టాల కింద పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు.

ప్రత్యేక కోర్టు తీర్పు , హైకోర్టు సుదీర్ఘ విచారణ: మొత్తం 78 మంది నిందితులపై సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2022లో ప్రత్యేక న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిస్తూ 49 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదు విధించింది. మిగిలిన 28 మందిని ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. చట్టం ప్రకారం ఉరిశిక్ష అమలు కావాలంటే హైకోర్టు ధ్రువీకరణ (Confirmation) తప్పనిసరి. దీంతో గుజరాత్ ప్రభుత్వం ఈ శిక్షల నిర్ధారణ కోసం హైకోర్టును ఆశ్రయించగా, దోషులు కూడా ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ అప్పీళ్లు దాఖలు చేశారు.

జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాసనం గత రెండున్నరేళ్లుగా ఈ అప్పీళ్లపై అత్యంత సుదీర్ఘంగా, నిశితంగా విచారణ జరిపింది. ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 248 సార్లు ధర్మాసనం సమావేశమై ఇరుపక్షాల వాదనలను విన్నది. ప్రాసిక్యూషన్ సమర్పించిన తిరుగులేని సాక్ష్యాధారాలు, శాస్త్రీయ విశ్లేషణలను పరిశీలించిన అనంతరం, ఉగ్రవాదులు చేసిన నేరం ‘అరుదైన వాటిల్లోకెల్లా అత్యంత అరుదైనది’ (Rarest of Rare) గా పేర్కొంటూ, కింది కోర్టు విధించిన ఉరిశిక్షలను సమర్థిస్తూ హైకోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించింది. బాధితులకు 18 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో న్యాయం చేకూరినట్లయింది.

Also Read : జూలై 17న పట్టాలెక్కనున్న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు..దీని ప్రత్యేకతలివే…

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.