Shapoor Zadran :  క్రికెట్ ప్రపంచంలో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) కన్నుమూశారు. ఆయన తన 39వ పుట్టినరోజు జరుపుకోవడానికి కేవలం ఒక్క రోజు ముందే మరణించడం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. గత కొంతకాలంగా HLH అనే అరుదైన రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు బలమైన పునాది వేసిన ఆటగాళ్లలో షాపూర్ జద్రాన్ ఒకరు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అయిన జద్రాన్ … 2009 నుండి 2020 వరకు ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఆయన 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున 10 వికెట్లతో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచారు. వన్డేల్లో 43 వికెట్లు, టీ20ల్లో 37 వికెట్లు సాధించిన ఆయన.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి వందలాది వికెట్లు పడగొట్టారు.

అయితే, గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. శరీరంలో రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగిపోయి అంతర్గత అవయవాలపై దాడి చేసే ప్రమాదకరమైన HLH సిండ్రోమ్ బారిన పడటంతో, మెరుగైన చికిత్స కోసం ఈ ఏడాది జనవరిలో ఆయనను ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఢిల్లీలో ఆయన చికిత్స పొందుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత కెప్టెన్ హష్మతుల్లా షాహిది, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ లాంటి ఎంతో మంది క్రికెటర్లు ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. కానీ, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన ఇవాళ కన్నుమూశారు.

షాపూర్ జద్రాన్ మృతిపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.