
Strait of Hormuz : మిడిల్ ఈస్ట్ లో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న వేళ వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ.. కేవలం 24 గంటల వ్యవధిలో మూడు వాణిజ్య చమురు, గ్యాస్ ట్యాంకర్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది.
బ్రిటన్ నావికాదళ సంస్థ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ ముఖద్వారం గుండా ప్రయాణిస్తున్న మూడవ ట్యాంకర్‌ను ఒక అపరిచిత డ్రోన్ ఢీకొట్టింది. ఈ దాడిలో ఓడ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ.. ప్రాణనష్టం కానీ, పర్యావరణ ముప్పు కానీ జరగలేదని, ఓడ తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేసింది.
అంతకుముందు జరిగిన రెండు దాడుల్లో ఒకటి ఖతార్‌కు చెందిన ప్రముఖ ఎల్ఎన్జీ ట్యాంకర్ అల్ రేకాయత్ పై జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఓడపై డ్రోన్ లేదా క్షిపణి దాడి జరగడంతో ఇంజన్ రూమ్‌లో భారీగా మంటలు, పొగ వ్యాపించాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్లే ఈ గ్యాస్ ట్యాంకర్‌పై దాడి జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నప్పటికీ, ఆ దేశం ఈ దాడి బాధ్యతను ప్రత్యక్షంగా అంగీకరించలేదు. అలాగే సౌదీ అరేబియాకు చెందిన వెద్యాన్ అనే మరో ముడి చమురు సూపర్ ట్యాంకర్ కూడా ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. తమకు నచ్చిన, తాము అనుమతించిన మార్గాల గుండా వెళ్లే ఓడలకే రక్షణ ఉంటుందని ఇరాన్ ఇండైరెక్ట్‌గా హెచ్చరిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ (86) మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి ప్రస్తుతం ఇరాన్‌లోని పవిత్ర నగరం కోమ్ లో భారీ ఎత్తున అంత్యక్రియల ఊరేగింపులు జరుగుతున్నాయి. ఈ ఊరేగింపుల్లో పాల్గొన్న లక్షలాది మంది ఇరానియన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా, ప్రతీకారం తీర్చుకుంటామంటూ నినాదాలు చేస్తున్నారు.









