హర్మూజ్ జలసంధిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా శరవేగంగా విరుచుకుపడింది. ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాలే లక్ష్యంగా అమెరికా దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అంతర్జాతీయ జలమార్గాల్లో అమాయక పౌరులు ప్రయాణించే వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్రమైన విషయమని అమెరికా పేర్కొంది. ఇరాన్ చేసిన ఈ తప్పుకు భారీ మూల్యం చెల్లించుకునేలా చేయడానికే తమ దళాలు రంగంలోకి దిగాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అమెరికా వైమానిక దళాలు ఇరాన్ రక్షణ వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. ప్రధానంగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా కేంద్రాలు, క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్ ప్రయోగ స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసినట్లు ఓ అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. వీటితో పాటు కీలకమైన నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపైనా బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడుల ధాటికి ఇరాన్‌లోని ఖేష్మ్‌, బందర్ అబ్బాస్ నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం అంగీకరించింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం తుర్కియేలో ఉన్న సమయంలోనే ఈ కీలక సైనిక చర్య జరిగింది.

ఈ భౌతిక దాడులు జరగడానికి కొద్ది గంటల ముందే అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు ఉన్న చమురు విక్రయాల లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారులు తెలిపారు. అయితే అమెరికా తీసుకున్న ఈ ఆర్థిక నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని మండిపడింది.