
అమెరికాలో చదువుకుని.. ఉద్యోగం చేయాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస నిబంధనలలో భారీ మార్పులు చేయనున్నారు. యూఎస్ కార్మిక విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, విదేశాంగ విభాగం గ్రీన్ కార్డ్, హెచ్-1బి వీసా, వీసాపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ తగలనుందని చెప్పవచ్చు.
ఐటీ నిపుణులకు ముఖ్యమైన H-1B వీసా నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా మార్చబోతోంది. ఈ కొత్త ప్రతిపాదనలు ప్రధానంగా భారతీయ ఐటీ కంపెనీల నియామక పద్ధతులను దెబ్బకొట్టేలా ఉన్నాయి. భారతీయ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికాలోని థర్డ్-పార్టీ క్లయింట్ ఆఫీసుల్లో కూర్చోబెట్టి పని చేయించడంపై భారీగా ఆంక్షలు విధించనున్నారు. కంపెనీలు నిజమైన యజమాని-ఉద్యోగి సంబంధాన్ని నిరూపించే బలమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
దీనితో పాటు ఒక కంపెనీలో 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి వారిలో సగం కంటే ఎక్కువ మంది వీసా ఉద్యోగులు ఉంటే, వారు పాత ఉద్యోగుల వీసా పొడిగింపు కోరినప్పుడు కూడా వేల డాలర్ల అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తాత్కాలిక వర్క్ వీసాలు, గ్రీన్ కార్డ్ కేసుల కోసం కంపెనీలు ఇచ్చే కనీస వేతనాల పరిమితిని కూడా పెంచుతుండటంతో అమెరికా కంపెనీలకు విదేశీయులను స్పాన్సర్ చేసే ఖర్చు విపరీతంగా పెరిగిపోనుంది.
ఒక యజమాని విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ దరఖాస్తును దాఖలు చేయడానికి ముందు వారు తప్పనిసరిగా కార్మిక శాఖ నుంచి PERM లేబర్ సర్టిఫికేషన్‌ను పొందాలి. 2004లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నియామక విధానం పాతబడిపోయిందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే వీటిపై ప్రతిపాదన తీసుకురానుంది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు ఎంతకాలమైనా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం స్టూడెంట్ వీసాలకు గరిష్టంగా 4 ఏళ్ల కాలపరిమితి మాత్రమే విధిస్తారు. ఆ తర్వాత అక్కడ చదువు లేదా ప్రాజెక్ట్ కోసం కొనసాగాలంటే ఇమ్మిగ్రేషన్ చుట్టూ తిరిగి పొడిగింపు తెచ్చుకోవాలి. అంతేకాదు చదువు పూర్తయ్యాక ఉద్యోగ శిక్షణ కోసం ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వ్యవధిని, కోర్సు మధ్యలో చేసే CPTలపై కూడా ఆంక్షలు విధించేలా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త నియమాలను తీసుకురానున్నారు.
వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ రద్దు
H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే వర్క్ పర్మిట్ గడువు ముగిస్తే.. ఇప్పటివరకు లభించే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపును ఈ అక్టోబర్ 2025 నుండి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది. మళ్లీ కొత్త పర్మిట్ అమెరికా ఇమిగ్రేషన్ శాఖ ఇచ్చే వరకు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఈ శాఖలో దరఖాస్తుల ప్రాసెసింగ్ చాలా ఆలస్యంగా జరుగుతుంది. దీంతో మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.









