
NIA Raids : దేశంలో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసి, హింసాత్మక విధానాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పన్నుతున్న కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బుధవారం ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 10 రాష్ట్రాలు ,ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 20 వ్యూహాత్మక ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ప్రధానంగా ఐసిస్ (ISIS), ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) వంటి నిషేధిత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నెట్‌వర్క్‌లను అంతం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి.
భారత్‌లో హింసాత్మక ‘జిహాద్’ ద్వారా ఆధిపత్యాన్ని చెలాయించి, ‘ఖలీఫత్’ వ్యవస్థను స్థాపించేందుకు కొందరు విదేశీ హ్యాండ్లర్లతో చేతులు కలిపినట్లు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను వేదికగా చేసుకుని దేశంలోని యువతను తీవ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్న ప్రచారాలపై పక్కా సమాచారం సేకరించిన అనంతరం ఈ సోదాలు నిర్వహించారు. ఈ సమగ్ర తనిఖీల్లో ఇప్పటివరకు 11 మంది కీలక నిందితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయగా, ఒక బాలుడిని (జువైనల్) కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు విచారణలో అత్యంత కీలకమైన పురోగతి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ పోలీసులు ఈ ఏడాది మార్చి నెలలో ప్రాథమికంగా నమోదు చేసిన కేసును మే నెలలో ఎన్‌ఐఏ తన పరిధిలోకి తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం వేకువజామున 5 గంటల నుంచే ఎన్‌ఐఏకు చెందిన మూడు ప్రత్యేక బృందాలు విజయవాడలోని వించిపేట (గాంధీబొమ్మ సెంటర్), భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. వించిపేట ప్రాంతంలో ఉగ్ర అనుమానితుల ఇళ్లలో సోదాలు జరగడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Also Read : జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్: భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే?
ఈ ఉగ్ర నెట్‌వర్క్‌లో ప్రధాన నిందితుడైన రెహ్మతుల్లా షరీఫ్ మహ్మద్ నివాసంలో గతంలో నిర్వహించిన తనిఖీల్లో ఐసీస్, ఏక్యూఐఎస్‌లకు సంబంధించిన అనేక అభ్యంతరకర ప్రచార సామగ్రి, డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ సందర్భంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా వచ్చిన కీలక ఆధారాల ఆధారంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రెండవ విడత సోదాలు జరిగాయి. గతంలో మార్చి, మే నెలల్లో విజయవాడలో అరెస్టయిన నలుగురు నిందితుల నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది, వారికి స్థానికంగా వేరెవరైనా సహకరిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈరోజు నిర్వహించిన దాడుల్లో నిందితుల వద్ద నుంచి భారీగా అనుమానాస్పద డిజిటల్ పరికరాలు, హార్డ్‌డిస్క్‌లు, విదేశీ హ్యాండ్లర్లతో జరిపిన సంభాషణల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అందిన ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా భారతీయ యువతకు మతం పేరిట నూరిపోస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పురికొల్పుతున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. స్వాధీనం చేసుకున్న పరికరాలలోని సాంకేతిక డేటాను మరింత నిశితంగా విశ్లేషించేందుకు, అదనపు ఆధారాలు రాబట్టేందుకు వాటిని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఎన్‌ఐఏ ప్రతినిధులు తెలిపారు.
దేశభద్రతను అస్థిరపరిచేందుకు ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న ఈ అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్ మూలాలను శాశ్వతంగా పటాపంచలు చేసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులను విచారించడం ద్వారా మున్ముందు మరిన్ని ఆసక్తికర, కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా సాగుతున్న ఉగ్రవాద ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని దర్యాప్తు సంస్థలు సూచిస్తున్నాయి.
Also Read : వారెవ్వా: AI ఫీచర్‌తో నోకియా కీప్యాడ్ ఫోన్లు లాంచ్.. ఫీచర్లు సూపర్..!









