
Suryapet Congress : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గపోరు పరాకాష్ఠకు చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి జంక్షన్ వేదికగా మంగళవారం చోటుచేసుకున్న ఈ హింసాత్మక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీపై పట్టు సాధించేందుకు నాయకులు సాగిస్తున్న పోరు చివరకు కార్యకర్తల నడుమ రణరంగాన్ని తలపించింది.
సొంత పార్టీ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు దాడి
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంపై కర్రలతో దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం
కాంగ్రెస్… https://t.co/tCDfI68l0j pic.twitter.com/YB61yPstMI
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
ఈ ఘర్షణకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరే ప్రధాన కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ మండల కమిటీల నియామకాల విషయంలో ఈ నాయకుల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంది. తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ, మాజీ మంత్రి వర్గాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.
సొంత పార్టీ నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు దాడి
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంపై కర్రలతో దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం
కాంగ్రెస్… https://t.co/tCDfI68l0j pic.twitter.com/YB61yPstMI
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
సమస్య మరింత క్లిష్టంగా మారడానికి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికలే తక్షణ కారణమయ్యాయి. స్థానిక నాయకులు, సీనియర్లను సంప్రదించకుండా ఎమ్మెల్యే మందుల సామేల్ తనకు అనుకూలమైన వ్యక్తిని ఏకపక్షంగా ఎన్నుకున్నారని ఎంపీ చామల, రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ వేదికగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరేందుకు అర్వపల్లి వద్ద సిద్ధమయ్యారు. ఈ పర్యటన ద్వారా అధిష్ఠానం వద్ద తమ బలాన్ని ప్రదర్శించి, ఎమ్మెల్యేపై ఒత్తిడి తేలాలని వారు ప్రణాళిక రచించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు భారీగా అర్వపల్లి జంక్షన్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. గాంధీ భవన్‌కు వెళ్తున్న ఎంపీ, మాజీ మంత్రి అనుచరుల వాహనాలను అడ్డుకున్నారు. నిరసనకారులను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తొలుత తీవ్ర వాగ్వాదం ప్రారంభమైంది. పరస్పర దూషణలతో వాతావరణం క్షణాల్లో వేడెక్కింది.
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో ఒకరిపైకొకరు దాడులకు దిగారు. అర్వపల్లి రహదారి రాళ్ల దాడితో రణరంగాన్ని తలపించింది. ఇరుపక్షాల నాయకులు విచక్షణా రహితంగా రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ నిలిపి ఉంచిన అనేక కార్లు, ఇతర వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కర్రలతో జరిపిన పరస్పర దాడుల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు అదనపు బలగాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణను ఆపేందుకు యత్నించారు. అయితే ఉద్రిక్తత తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆందోళనకారులు పోలీసుల మాటలను కూడా లెక్కచేయలేదు. ఆ గందరగోళంలో రాళ్లు తగిలి పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి చేయిదాటిపోకుండా చూసేందుకు పోలీసులు చివరకు లాఠీఛార్జ్ చేసి దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టారు.
పోలీసుల లాఠీఛార్జ్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు నలుదిక్కులా పరుగులు తీశారు. ప్రస్తుతం అర్వపల్లిలో అదనపు పోలీసు బలగాలను మోహరించి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సొంత పార్టీ నాయకులే రోడ్డుపై పడి కొట్టుకోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఘటనకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.









