
దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి పోటీ పరీక్షల నిర్వహణలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA) తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ‘నీట్’ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం చల్లారకముందే, ఉన్నత విద్యార్హత పరీక్ష అయిన ‘యూజీసీ-నెట్’ (UGC-NET) సోషియాలజీ (సామాజిక శాస్త్రం) ప్రశ్నపత్రం కూడా పరీక్షకు ముందే లీకైందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చగా, లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
पिछले सप्ताह हुई UGC-NET परीक्षा को लेकर सामने आए गंभीर आरोप बेहद चौंकाने वाले हैं।
NEET पेपर लीक के कुछ ही हफ्तों बाद अब खबरें आ रही हैं कि –
– UGC-NET परीक्षा से ठीक पहले 100 पन्नों की एक PDF प्रसारित हुई।
– यह PDF उस question paper setting की है, जो सिर्फ़ NTA के पास उपलब्ध… pic.twitter.com/16hyeGaAlT— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2026
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించిన కథనం ప్రకారం.. యూజీసీ-నెట్ పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందే సుమారు 100 పేజీల అత్యంత రహస్య పీడీఎఫ్ (PDF) సర్క్యులేషన్లోకొచ్చింది. ఎన్టీఏ వద్ద మాత్రమే ఉండే ప్రశ్నాపత్రాల రూపకల్పన (Paper Setting) సమాచారంతో కూడిన ఈ పీడీఎఫ్లోని దాదాపు 90 ప్రశ్నలు అసలు సోషియాలజీ పరీక్షా పత్రంతో హూబహూ సరిపోలాయి. ఈ లీక్ అయిన పత్రాన్ని బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ ,రాజస్థాన్ వంటి కీలక రాష్ట్రాల్లో దాదాపు రూ. 2.25 లక్షలకు విక్రయించారని ఆయన ఆరోపించారు. ఇదే ముఠా రాబోయే సిఎస్ఐఆర్-నెట్ (CSIR-NET), హెచ్టీఈటీ (HTET), ఎడిఎ (ADA) వంటి నియామక పరీక్షల పేపర్లను కూడా విక్రయిస్తామని ప్రచారం చేసుకుంటోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ లీకేజీ వ్యవహారానికి ప్రధాన సాక్ష్యంగా హరియాణాలోని రోహ్తక్కు చెందిన విద్యార్థి నాయకులు దీపక్, అంకిత్లు విడుదల చేసిన ఒక వీడియో నిలిచింది. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. పరీక్షకు ముందే అభ్యర్థులకు బోధించిన రెండు సెట్ల ప్రశ్నలలో ఒక 100 ప్రశ్నల సెట్, జూన్ 30న నిర్వహించిన అసలు సోషియాలజీ ప్రశ్నాపత్రంతో నూరు శాతం సరిపోలిందని ఆధారాలతో సహా చూపించారు. ఈ పీడీఎఫ్ సాక్ష్యాలపై, ఎన్టీఏ వద్ద ఉన్న డిజిటల్ డేటాపై తక్షణమే స్వతంత్ర డిజిటల్ ఫోరెన్సిక్ తనిఖీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలతో పాటు, పేపర్లో దొర్లిన విపరీతమైన అక్షర దోషాలు, హాస్యాస్పదమైన అనువాదాలు విద్యావేత్తలను తీవ్ర విస్మయానికి గురిచేసాయి. సామాజిక శాస్త్రంలో ప్రముఖ భావనలు, శాస్త్రవేత్తల పేర్లు పూర్తిగా తప్పుగా ముద్రితమయ్యాయి. ఉదాహరణకు రిట్జర్ (Ritzer) అనే పేరును ‘పుట్జర్’ (Putzer) గా, పార్సన్స్ (Parsons) ను ‘పార్సో’ (Parsow) గా, ఘుర్యే (Ghurye) ను ‘ఘున్యే’ (Ghunye) గా, ‘సోషల్’ (Social) అనే పదాన్ని ‘ఓవల్’ (Oval) గా ముద్రించారు. ప్రొఫెసర్ , పీహెచ్డీ అర్హత పరీక్షలో కనీసం 5 ఏళ్ల పిల్లవాడు అనువాదం చేసినట్లుగా హిందీ వర్షన్ ఉండటం, పాఠ్యాంశాలతో సంబంధం లేని ప్రశ్నలు రావడంపై అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఈ నాణ్యతా లోపాలు ఇక్కడితోనే ఆగలేదు. మొత్తం 150 ప్రశ్నలలో కనీసం 67 ప్రశ్నలు గతంలో నిర్వహించిన 2024 పరీక్షలోని ప్రశ్నల నుంచి యథాతథంగా కాపీ చేసి ఇచ్చినవేనని అభ్యర్థులు ఆధారాలు బయటపెట్టారు. ఆఖరికి బహుళైచ్ఛిక ప్రశ్నల సమాధానాల క్రమాన్ని (Option Sequence) కూడా మార్చకపోవడం ఎన్టీఏ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివే అర్హులైన అభ్యర్థుల శ్రమను నీరుగారుస్తూ, ఏజెన్సీ కనీస ప్రామాణికత లేకుండా ప్రశ్నాపత్రాలను తయారుచేస్తోందనడానికి ఇవే నిదర్శనాలని అభ్యర్థులు వాపోతున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రక్రియలపై విశ్వసనీయత కోల్పోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకొని నిద్రపోతోందని, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రింటింగ్ లేదా అక్షర దోషాలు సహజమేనని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఎన్టీఏ వర్గాలు సాకులు చెబుతున్నప్పటికీ, లీకేజీ ఆరోపణలు , ఆధారాలపై ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వకపోవడం ఉద్రిక్తతను పెంచుతోంది. వరుస కుంభకోణాల నేపథ్యంలో విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తేవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి లోకం ఉద్యమిస్తోంది.









