
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో 18 చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్‌కు వాణిజ్య ప్రాతిపదికన యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం రికార్డు స్థాయిలో మొత్తం 18 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అణు ఇంధనం, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం వంటి రంగాలలో ఈ ఒప్పందాలు జరిగాయి.
భారతదేశం 2047 నాటికి ఏకంగా 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో ఏడు చోట్ల 24 అణు రియాక్టర్లు పనిచేస్తుండగా.. వాటి స్థాపిత సామర్థ్యం కేవలం 8.78 గిగావాట్లు మాత్రమే ఉంది. ఈ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు అనేక కొత్త రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నింటికీ అణు ఇంధనమైన యురేనియం ఎంతో అవసరం. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అత్యధిక యురేనియం నిల్వలు ఉన్నాయి. 12 ఏళ్ల క్రితమే పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరినా.. అది ఇప్పుడు మోదీ పర్యటనతో సాకారమైంది. ఈ యురేనియం సరఫరా భారత ఇంధన రంగానికి ఒక మైలురాయిగా మారబోతోంది.
ఈ పర్యటనలో కుదిరిన ఒప్పందాల్లో రక్షణ రంగ భాగస్వామ్యం అత్యంత వ్యూహాత్మకంగా మారింది. కేవలం సైనిక విన్యాసాలకే పరిమితం కాకుండా.. ఆయుధాలను సంయుక్తంగా ఉత్పత్తి చేయడం, ఒకరి భూభాగం నుంచి మరొకరి యుద్ధ విమానాలను మోహరించడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ఇరు దేశాల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. అలాగే తీర ప్రాంత నిఘా, సముద్ర సమాచార మార్పిడి, కాలుష్య నియంత్రణపై కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
విద్యా రంగంలో కూడా ఇరు దేశాలు కీలక ముందడుగు వేశాయి. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫ్లిండర్స్ యూనివర్సిటీ బెంగళూరులో, విక్టోరియా యూనివర్సిటీ గురుగ్రామ్‌లో తమ స్వంత క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు స్వదేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రానుంది. మైనింగ్ రంగంలో నైపుణ్యం పెంచేందుకు భువనేశ్వర్‌లోని ‘జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ’లో ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు కానుంది. పారిశ్రామికంగా చూస్తే.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ‘ఆస్ట్రేలియన్ సూపర్’ సంస్థ ఏకంగా 50 కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.
మెల్‌బోర్న్‌లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో జరిగిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ సభలో దాదాపు 30 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. స్టేడియం అంతా ‘మోదీ.. మోదీ..’ నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ నేడు చిప్‌ల నుంచి షిప్‌ల వరకు అన్నింటా గ్లోబల్ తయారీ కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు.
Also Read : నోవో నార్డిస్క్ విప్లవాత్మక అడుగు.. ఇక మనదేశంలోనూ వారానికి ఒక్కసారే ఇన్సులిన్…









