
BIG BREAKING : వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ ప్రధాన కోచ్ డారెన్ సామీ స్వయంగా వెల్లడించారు. టెస్ట్ క్రికెట్లో హోల్డర్ ఇంకా తమ ప్రణాళికల్లో ఉన్నాడని, కానీ వన్డేల నుంచి మాత్రం ఆయన తప్పుకున్నాడని సామీ స్పష్టం చేశారు.
టెస్టులు, వన్డేల భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు సామీ స్పందిస్తూ.. జాసన్ హోల్డర్ ఇంకా టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉన్నాడు. అతను వన్డేల నుంచి రిటైర్ అయ్యాడని నాకు తెలుసనని తెలిపారు. అంతేకాకుండా, హోల్డర్ ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్లోనూ బిజీగా ఉన్నాడని, అతని లభ్యత మరియు జట్టులో అతను ఎక్కడ సరిపోతాడనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని సామీ పేర్కొన్నారు. అయితే, టెస్ట్ క్రికెట్ ఆడటానికి హోల్డర్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడని కోచ్ వెల్లడించారు.
గత కొన్నాళ్లుగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హోల్డర్, తన చివరి వన్డేను 2023 జూలైలో హరారే వేదికగా జింబాబ్వేపై ఆడాడు. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న ఆయన, ఇప్పుడు అధికారికంగా వన్డే కెరీర్‌కు ముగింపు పలికారు. వెస్టిండీస్ తరపున ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హోల్డర్, టెస్టుల్లో మాత్రం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుండటం ఆయన అభిమానులకు కొంత ఊరటనిచ్చే విషయం.









