nagaland landslide disaster
nagaland landslide disaster

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడి ఎన్నో ఇళ్లు వరద దాటికి కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి విషాద సంఘటనే నాగాలాండ్‌లో చోటుచేసుకుంది.

గత కొద్ది రోజులుగా నాగాలాండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తాజాగా అక్కడ తీవ్ర విషాదాన్ని నింపాయి. ముఖ్యంగా మోన్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విపత్తులో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మోన్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం మొదలైంది. సుమారు ఒంటిగంట నుంచి ఉరుములు, మెరుపులతో ప్రారంభమైంది. అలా ఉదయం 6 గంటల సమయంలో కొండ ప్రాంతాల నుండి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి మోన్ పట్టణంలోని డిఫెన్స్ కాలనీ, తిజిత్ నివాస ప్రాంతాలపైకి దూసుకొచ్చాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

ప్రస్తుతానికి నివాస భవనాల కింద ఉన్న నాలుగు డెడ్ బాడీలను రక్షణ బృందాలు బయటకు తీశాయి. అందులో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఘటనలో దాదాపు 15 వరకు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు సమాచారం. అనేక రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. కరెంట్ స్తంభించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.