
Trainee IPS officer :ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన అసలు ఆత్మహత్యాయత్నమే చేసుకోలేదని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అకాడమీ నుంచి సస్పెన్షన్ గురైన అనంతరం, ఆయన శానిటైజర్ లేదా ఇతర విషపూరిత పదార్థాలు తాగి బలవన్మరణానికి యత్నించారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా అధికారులు పూర్తి వివరాలను వెల్లడించారు. ఆయన ఎలాంటి విషపూరిత ద్రవపదార్థాలు సేవించలేదని వైద్య నివేదికల్లో స్పష్టంగా నిర్ధారణ అయింది. కేవలం పరిమితికి మించి అతిగా మద్యం సేవించడం వల్లే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత నుంచి తప్పించుకోవడానికి, ప్రజల్లో సానుభూతి (సింపతీ) పొందేందుకే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం సృష్టించారని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు, ఈ ఘటనకు ముందు వెలుగులోకి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ , ఆయన చేసిన ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ లేఖను ఆయన స్వయంగా రాశారా లేదా అనే అంశంతో పాటు అందులో పేర్కొన్న డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే కోణంలోనూ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.









