Uday Krishna Reddy :  ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. ఆయన పిటిషన్‌లో పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. ముస్సోరిలో ట్రైనింగ్ సమయంలో తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా మెలిగామని, సర్వీసులో చేరాక వివాహం చేసుకోవాలనుకున్నామని ఆయన పేర్కొన్నారు. కాబోయే భార్య అనే నమ్మకంతో ఆమెకు తాను ఆర్థికంగా ఎంతో సాయం చేశానని తెలిపారు.

అయితే, తనపై అనుమానం పెంచుకున్న ఆమె ఈ ఏడాది మే నెలలో మరో ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకున్నట్లు ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పెళ్లి తర్వాత తనకు వేరే మహిళతో ఎలాంటి సంబంధం లేదని అర్థమై, నేనంటే ఇప్పటికీ ఇష్టమంటూ ఆమె పోలీస్ అకాడమీలోని తన గదికి వచ్చిందని వెల్లడించారు. కానీ ఆమెకు వివాహం అయిపోవడంతో తాను ఆమెను తిరస్కరించానని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పానని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె తరచూ ఫోన్ చేస్తూ, గదికి వస్తుండటంతో ఈ విషయం ఆమె భర్తకు తెలిసి నిలదీశాడని తెలిపారు.

తన నిజాయతీ నిరూపించుకునేందుకే తాము కలిసి ఉన్న ఒక వీడియోను ఆమె భర్తకు పంపానని, అది చూసి ఆమె భర్త గొడవ పడటంతో.. తనపై కక్షగట్టి అకాడమీ డైరెక్టర్‌కు, ఆ తర్వాత పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని ఉదయ్ కృష్ణారెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను, వీడియోలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు, ఉదయ్ కృష్ణారెడ్డి తనకు అసభ్య సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించారని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి, బాధితురాలి ఫోన్లను పరిశీలిస్తే ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటపడతాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన ఫోన్ ఎక్కడుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్వాష్ పిటిషన్ త్వరలోనే హైకోర్టు ముందుకు రానుండటంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.