
supreme court : ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయవాది ప్రస్తావించిన వీడియోలపై సీజేఐ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బుధవారం ఈ అంశాన్ని ధర్మాసనం ముందు ప్రస్తావించిన న్యాయవాది, విద్యార్థులపై పోలీసుల చర్యలను సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించాలని కోరారు. అయితే దీనిని ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ, మా సమయాన్ని వృథా చేయకండి… మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి అని న్యాయవాదికి సూచించారు.
దీనికి స్పందించిన న్యాయవాది, విద్యార్థులు నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష నిర్వహణలో లోపాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు వంటి ప్రజా ప్రయోజన అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారని కోర్టుకు వివరించారు. అయితే న్యాయవాది వాదనను మధ్యలోనే ఆపిన సీజేఐ థ్యాంక్యూ వెరీ మచ్ అంటూ స్పందించారు. అనంతరం పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని న్యాయవాది మరోసారి ప్రస్తావించగా, వీడియోలు చూడటానికి మా వద్ద సమయం లేదు. మాకు వీడియోలు చూడాలనే ఆసక్తి కూడా లేదని సీజేఐ స్పష్టం చేశారు.
కాగా, ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కూడా మంగళవారం అత్యవసరంగా విచారించేందుకు నిరాకరిస్తూ, “ప్రతి విషయాన్నీ కోర్టులోకి లాగొద్దు” అని వ్యాఖ్యానించింది.









