Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Pakistan : ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్‌ రహస్య రక్షణ? మండిపడుతున్న అమెరికా

Pakistan-Iran Conflict
Pakistan-Iran Conflict

Pakistan  : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన కీలక సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా సహాయం చేసిందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా నిఘా వర్గాల నివేదికల ప్రకారం, అమెరికా దాడుల భయంతో ఇరాన్ తన అత్యంత కీలకమైన నిఘా, గూఢచారి విమానమైన RC-130ను పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న ‌నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌కు తరలించింది.

ఓవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించిన పాకిస్తాన్, మరోవైపు ఇరాన్ యుద్ధ విమానాలకు రహస్యంగా రక్షణ కల్పించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం మాట్లాడుతూ, ఈ వార్తలు నిజమైతే పాకిస్తాన్‌ను ఇకపై నమ్మదగిన మధ్యవర్తిగా పరిగణించలేమని, వారి పాత్రపై తాము పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ అత్యంత రద్దీగా ఉండే నగర ప్రాంతంలో ఉందని, అక్కడ భారీ యుద్ధ విమానాలను రహస్యంగా దాచడం అసాధ్యమని పాక్ అధికారులు వాదిస్తున్నారు. ఆ విమానాలు కేవలం దౌత్యపరమైన చర్చల కోసమే పాకిస్తాన్‌కు వచ్చాయని వారు స్పష్టం చేశారు.

మరోవైపు, ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ పంపిన ఆ కాగితాలు అర్థం లేనివని, ప్రస్తుతం కాల్పుల విరమణ (Ceasefire) ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ తీరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.