దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలు, వరుస పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేపడుతున్న వేళ మాట్లాడారు. చివరి నిమిషంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వల్ల విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.

గత 10 ఏళ్లలో దేశంలో ఏకంగా 152 ప్రవేశ, ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని రాహుల్ తెలిపారు. దీనివల్ల దాదాపు 7.50 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి రూ.1.4 లక్షల కోట్లు కేటాయించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, విద్యార్థుల బాధలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇన్ని వందల లీకేజీలు జరిగినా ఇప్పటివరకు ఏ ఒక్క నేరస్థుడికి శిక్ష పడలేదని.. ఆ సంఖ్య ‘సున్నా’ అని విమర్శించారు.

తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడంపై రాహుల్ తప్పుబట్టారు. విద్యార్థులు మన శత్రువులు కారని, వారే ఈ దేశ భవిష్యత్తు అని స్పష్టం చేశారు. దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, కార్పొరేట్ రంగంలో ఏఐ రాకతో ఉన్న కొలువులు కూడా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడా వ్యాపారులు బ్యాంకులను దోచుకుంటున్నారని, పరిశ్రమలు మూతపడి చైనా వస్తువుల దిగుమతి పెరుగుతోందని, సామాన్యులకు చదువు పెద్ద ఆర్థిక భారంగా మారిందని పేర్కొన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. నిరసన తెలుపుతున్న యువతపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆందోళనను తాము రాజకీయాలకు వాడుకోవడం లేదని, వారి గళాన్ని వినిపించడమే ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని రాహుల్ చెప్పారు. పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాము రోడ్లపైకి వచ్చామని తెలిపారు.