
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భారీ అక్రమాస్తుల కేసు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ డివిజినల్ ఇంజనీర్ (DE) ముత్యం వెంకట రమణ నివాసాలు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ మెరుపు దాడుల్లో రూ.400 కోట్ల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున నగదు, బంగారం, విలాసవంతమైన భవనాలు, ఫ్లాట్లు, బినామీ కంపెనీలకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో 2019లో జరిగిన ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి వద్ద రూ. 25.70 కోట్ల విలువైన అధికారిక ఆస్తులు గుర్తించడమే ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసిన అతిపెద్ద కేసుగా ఉండేది. అయితే ప్రస్తుత దాడుల్లో వెంకట రమణ నుంచి ఏసీబీ లెక్కించిన అధికారిక ఆస్తుల విలువ రూ.27.65 కోట్లు. మార్కెట్‌లో వీటి విలువ ఏకంగా రూ.400 కోట్ల పైమాటే. దీంతో రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ అవినీతి తిమింగలంగా వెంకట రమణ రికార్డు సృష్టించారు.
ఏసీబీ సిటీ రేంజ్-2 డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట సహా మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కూకట్‌పల్లి అంజనేయనగర్‌లో జీ+3 వాణిజ్య భవనం, గుట్టల బేగంపేట్‌లో జీ+5 వాణిజ్య భవనంతో పాటు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి పరిధిలో 4 ఖరీదైన ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీటికి తోడు తన భార్య పేరు మీద నాలుగు నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసి కూకట్‌పల్లి, మూసాపేట ప్రాంతాల్లో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 10 మల్టీ స్టోరీ అపార్ట్‌మెంట్లను నిర్మించినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విచారణలో రూ.52 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 2.09 కిలోల బంగారు ఆభరణాలు, రూ.45 లక్షల విలువైన కియా, మహీంద్రా, బలెనో కార్లతో పాటు రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలను జప్తు చేశారు. ఇవే కాకుండా రూ.2.5 లక్షల విలువైన 20 విదేశీ మద్యం సీసాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
వెంకట రమణ గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSDCL) సైబర్ సిటీ సర్కిల్‌లో డీఈగా పనిచేస్తున్న కాలంలోనూ తీవ్ర అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. 2019 డిసెంబర్ 12న ఒక కాంట్రాక్టర్ బిల్లుల ఆమోదం కోసం రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి జైలుకు కూడా వెళ్లారు. అప్పట్లో ఆయన ఇంట్లో జరిపిన దాడుల్లో రూ. 28.14 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనను మార్చుకోలేదు. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రభావంతో డిప్యూటేషన్‌పై ‘రెడ్కో’ (REDCO) సంస్థలో డీఈగా కీలక పోస్టింగ్ దక్కించుకున్నారు. అక్కడ చేరినప్పటి నుంచి మళ్లీ తన అవినీతి దందాను కొనసాగించారు. పెద్ద ఎత్తున బినామీల పేరిట అక్రమాస్తులు కూడబెట్టారు. ఈ క్రమంలోనే అధికారులు తాజాగా అతన్ని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.









