
సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టుగా మొదలైన ఉద్యమం.. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోకాలిపైకి తెచ్చే స్థాయికి చేరుకుంటుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. దేశ చరిత్రలోనే విద్యార్థులు, నిరుద్యోగ యువత కలిసి చేసిన ఈ పోరాటం అపూర్వ విజయాన్ని సాధించింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో దాదాపు 36 రోజుల పాటు సాగిన ఈ భారీ నిరసన ముందు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
అదే సమయంలో జంతర్ మంతర్ వద్ద మొహమ్మద్ జునైద్ అనే యువకుడు చేసిన పని యావత్ దేశాన్నే ఆశ్చర్యపరిచింది. ధర్నాలు, వివాదాలు రగిలే చోట.. ఆకలితో అలమటిస్తున్న నిరుద్యోగులు, విద్యార్థులకు ఆహారం అందిస్తూ మనుషుల మధ్య మతం సరిహద్దు కాదని నిరూపించాడు. అతడి ఉదారతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు.. ఆహారం వడ్డించి ఆకలి తీర్చిన మొహమ్మద్ జునైద్ ఎవరు?.. ఎక్కడి నుంచి వచ్చాడు?..అనేది పూర్తిగా తెలుసుకుందాం.
ఆహారం, మంచినీళ్లు అందించిన మొహమ్మద్ జునైద్
నెలరోజుల పాటు జరిగిన నిరసనలో అక్కడికి వచ్చిన విద్యార్థులకు కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేదు. ఇలాంటి సమయంలోనే వారికి ఒక వ్యక్తి నేనున్నా అంటూ ముందుకొచ్చారు. అతనికి వాళ్లతో ఏ సంబంధం లేదు, ఎలాంటి స్వార్థం లేదు.. కేవలం మానవత్వంతో గత 30 రోజులకు పైగా యువతీ, యువకులకు ఉచితంగా ఆహారం, మంచి నీళ్లు అందిస్తూ వార్తల్లో నిలిచాడు. అతనే మహమ్మద్ జునైద్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతని పేరే వినిపిస్తోంది. జునైద్ రియల్ హీరో అంటూ లక్షలాది మంది నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ జిల్లా, నహాల్ గ్రామానికి చెందిన ఒక సాధారణ యువకుడు విద్యార్థులకు ఫ్రీగా ఆహారం, నీరు అందించాడు. ఇతని వద్ద ఎలాంటి ఫండ్స్ లేవు, వెనకాల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లేవు. కేవలం తన సొంత ఖర్చులతో, తనకు ఉన్నంతలో విద్యార్థులకు వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ పంచడం స్టార్ట్ చేశాడు. ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు.. వరుసగా 30 రోజులకు పైగా జంతర్ మంతర్ వద్ద ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటూ ఆహారాన్ని పంపిణీ చేశాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. జునైద్‌ను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
జునైద్ చూపించిన ఈ మానవత్వం కేవలం జంతర్ మంతర్‌కే పరిమితం కాలేదు. ఇది ఒక పెద్ద ‘Mass Movement’ గా మారింది!. జునైద్ స్ఫూర్తితో దేశంలో ఎక్కడెక్కడో ఉన్న సామాన్య ప్రజలు కూడా స్పందించారు. తమ ఇంట్లో కూర్చునే జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ లాంటి డెలివరీ యాప్స్ ద్వారా జంతర్ మంతర్ లోకేషన్ పెట్టి, అక్కడ ఉన్న విద్యార్థుల కోసం ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు, మందులు పంపించడం స్టార్ట్ చేశారు. ఒక్క జునైద్ మొదలుపెట్టిన సేవ.. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మందిని కనెక్ట్ చేసింది. భిన్నత్వంలో ఏకత్వానికి, మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.
కానీ, ఇక్కడే అసలు కథ తిరిగింది! కథలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది!.
ఏ రోజైతే జునైద్ పేరు సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అవ్వడం ప్రారంభమైందో, ఆ మరుసటి రోజే యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. జునైద్ స్వగ్రామమైన ఘాజియాబాద్‌లోని అతని ఇంటిపై పోలీసులు రాత్రివేళల్లో తనిఖీలు చేపట్టారు. జునైద్ జంతర్ మంతర్ వద్ద అందుబాటులో లేకపోవడంతో, అతని తండ్రిని, ఇతర కుటుంబ సభ్యులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అంతేకాకుండా, వారి ఇంట్లోని ముఖ్యమైన పర్సనల్ డాక్యుమెంట్స్, బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డులను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. “ఆహారం పంచడం నేరమా?”, “ఒక మంచి పని చేసినందుకు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతారా?” అంటూ విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జునైద్‌కు సపోర్ట్‌గా వేలాది మంది నెటిజన్లు పోస్టులు పెట్టడం ప్రారంభించారు.
ఈ వివాదం పెరగడంతో చివరికి దీనిపై జునైద్ స్వయంగా స్పందించాడు. తన కుటుంబంపై ఒత్తిడి తేవడం వల్ల తాను కొంత ఆందోళనకు గురయ్యానని, అయితే మీడియా, నెటిజన్ల సపోర్ట్ వల్ల పోలీసులు తన తండ్రిని, బంధువులను సురక్షితంగా ఇంటికి పంపించారని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తమ కుటుంబం సురక్షితంగానే ఉందని, తాను చేసిన పనిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం, స్వార్థం లేవని, కేవలం మానవతా కోణంలోనే విద్యార్థులకు సహాయం చేశానని క్లారిటీ ఇచ్చాడు. పోలీసులు కూడా ఇది కేవలం రొటీన్ చెకప్‌లో భాగమేనని, ఎలాంటి అక్రమ ఫండింగ్ లేదా అనుమానాస్పద కార్యకలాపాలు లేవని చెక్ చేసుకోవడానికి మాత్రమే విచారణ జరిపామని తెలిపారు.
చూశారుగా.. సమాజంలో ఎంతోమంది ఉంటారు. కానీ ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి స్వచ్ఛందంగా చేయి అందించేవారు చాలా అరుదుగా ఉంటారు. మహమ్మద్ జునైద్ చేసిన పని ఏ మతానికో, ఏ రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు.. అది కేవలం నిస్వార్థమైన ‘మానవత్వం’. పోలీసులు విచారణల పేరుతో తమ పని తాము చేసుకోవచ్చు. కానీ జునైద్ చూపించిన ఈ సేవా గుణం మాత్రం ఈరోజు దేశంలో లక్షలాది మంది యువతకు ఒక గొప్ప ఇన్స్‌ప్రేషన్‌గా నిలిచింది.
సీజేపీ ఆవిర్భావం
2026 మే 15న కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘వీరు బొద్దింకల వంటివారు’’ అని నిరుద్యోగ యువతను సంబోధించడంతో యువత ఆగ్రహానికి గురైంది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దీప్కే అనే యువకుడు సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘దేశంలోని బొద్దింకలంతా (యువత) ఒక్కటైతే ఎలా ఉంటుంది?’’ అని వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో మే 16,2026న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక వెబ్ సైట్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేశారు. ఆ తర్వాత నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాలు, తీవ్ర నిరుద్యోగంతో విసిగిపోయిన యువత.. దీనిని ఒక ఉద్యమ నినాదంగా మలుచుకున్నారు. దీనికి అతి తక్కువ సమయంలోనే లక్షల్లో ఫాలోవర్స్ రావడం ప్రారంభించారు.
Junaid, who was distributing food to protestors at Jantar Mantar, was allegedly picked up by Delhi Police on the night of 24 July. He was kept blindfolded throughout the night. The next morning, an officer questioned him about the source of his funding and how he was managing to…
— Piyush Rai (@Benarasiyaa) July 26, 2026
జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు
అభిజిత్ దీప్కే జూన్ 6, 2026న అమెరికా నుండి ఢిల్లీ చేరుకుని జంతర్ మంతర్‌కు వెళ్లడంతో ఈ నిరసనలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో చిన్నగా మొదలైన ఈ ఉద్యమం.. రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోయింది. విద్యార్థుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగ యువత కదం తొక్కింది. అలా ఐదు రోజులు గడిచిన తర్వాత అంటే జూన్ 11న విద్యార్థులు తమ 5 డిమాండ్ల మేనిఫెస్టోను విడుదల చేశారు. దీంతో ఈ పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది.
ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రముఖులు
అయితే ఈ పోరాటానికి కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేశాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉద్యమానికి అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్. ఈయన ఒక పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త. విద్యార్థుల నిరసనకు సపోర్ట్ చేస్తూ దాదాపు 20 రోజుల పాటు ఆమరణ నిరాహర దీక్ష చేశారు. ఆయనతో పాటు సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ సహా సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది సీజేపీ ఉద్యమానికి బాసటగా నిలిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
తీవ్ర రూపం దాల్చిన ‘చలో సంసద్’ మార్చ్
ఇక జూలై 20న సీజేపీ ‘చల్ సంసద్’ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇదే ఆ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. పార్లమెంట్ ముట్టడికి వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా వెళ్లగా.. ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. అక్కడితో ఆగకుండా బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో పలువురు గాయపడి.. నిరసన తీవ్రరూపం దాల్చింది. ఇలా 2001 తర్వాత పార్లమెంట్ గేటుకు తాళాలు వేయడం ఇదే తొలిసారి.
దిగొచ్చిన కేంద్రం
విద్యార్థులపై లాఠీఛార్జ్, సోనమ్ వాంగ్‌చుక్ అనారోగ్యం, నిరసనకు పెరుగుతున్న మద్దతుతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. సీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో సీజేపీ ప్రధాన డిమాండ్లలో అత్యంత కీలకమైనది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. చివరికి సుదీర్ఘ పోరాటం తర్వాత జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇది చారిత్రాత్మక విజయంగా వార్తల్లో నిలిచింది.









