Bhavishyavani :  సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ తరుణంలో జాతరలో అత్యంత కీలక ఘట్టమైన భవిష్యవాణి కార్యక్రమం తీవ్ర ఉద్విగ్నత మధ్య కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. భక్తులు, నిర్వాహకుల తీరుపై అమ్మవారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె ఆవేశంగా తెలిపారు.

తాను సంతోషంగా రాలేదని, తీవ్రమైన క్రోధంతో వచ్చానని మాతంగి స్వర్ణలత హెచ్చరించారు. తన విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు ఆచరణలో పెట్టడం లేదని, మీరంతా చేసే పనులే తనకు కోపాన్ని తెప్పిస్తున్నాయని మండిపడ్డారు. భక్తులు అడిగే ప్రతిదానికీ తాను ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించిన ఆమె, తాను చెప్పిన ఏ ఒక్క విషయాన్ని కూడా ఎవరూ ఆచరించడం లేదని, అందరూ తన ఆగ్రహానికి గురవుతున్నారని హెచ్చరించారు. ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ ఏడాది ప్రకృతి ప్రకోపించే అవకాశం ఉందని, కుంభవర్షాలు, భారీ అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీ వర్షాలతో జనాలు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని, అయితే ఏ ప్రమాదం వచ్చినా, ఎలాంటి ఆపద ముంచుకొచ్చినా తనే స్వయంగా తన భక్తులను ఆదుకుంటానని అభయం ఇచ్చారు. ప్రస్తుత సమాజంలో మనుషులు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారని, కన్న తల్లిదండ్రులను సైతం పిల్లలు ఊరి మీద వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంతోషం కలిగించేలా ప్రజలు ఎవరూ నడుచుకోవడం లేదని, అందరిలోనూ అహంకారం విపరీతంగా పెరిగిపోయిందని, దానిని వెంటనే తగ్గించుకోవాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా భవిష్యవాణి వినిపిస్తున్నంత సేపూ మాతంగి స్వర్ణలత కంటతడి పెట్టుకోవడం అక్కడ ఉన్నవారందరినీ కలచివేసింది. రాబోయే ఆరు నెలల లోపు తన విగ్రహ ప్రతిష్టను పూర్తి చేస్తే తాను శాంతిస్తానని, భక్తుల కోరికలన్నీ తీరుస్తానని అమ్మవారు స్పష్టం చేశారు. ఒకవేళ తన ఆగ్రహానికి, ప్రతిష్టకు అడ్డువచ్చిన వాళ్లను ఎవరినైనా సరే కాళ్ల కింద తొక్కేస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.