
Canada : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో అక్కడ ఉపాధి పొందుతున్న భారతీయులు అర్థంతరంగా తిరిగి ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. ఒకవైపు అమెరికా వీసాల విషయంలో భారతీయులపై ఉక్కపాదం మోపుతుంటే తాజాగా కెనడా అదే బాటలో నడుస్తోంది. ఈ ఏడాది మొదటి అర్నెళ్లలో కెనడా 3,323 మంది భారతీయులను స్వదేశానికి డిపోర్టు చేసింది. విసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ల తగ్గింపునకు తీసుకుంటున్న చర్యలతో డిపోర్టేషన్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
వివిధ కారణాలతో ఆ దేశంలో శరణార్థిగా ఉంటున్న పలువురి అభ్యర్థనలు తిరస్కరణకు గురి కావడంతో వాందరినీ స్వదేశానికి పంపించేందుకు కెనడా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం వారినే కాకుండా వీసా, వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసినప్పటికీ కెనడాలోనే నివాసం ఉంటున్న వారిని కూడా డిపోర్టు చేస్తున్నారు. అలాగే కెనడాకు రావడానికి నకిలీ పత్రాలు సమర్పించి మోసాలు చేస్తున్నారనే ప్రచారంతో దరఖాస్తు పరిశీలనను కూడా మరింత కఠినతరం చేశారు. తప్పుడు వివరాలను పొందుపరచడం, అడ్మిషన్లకు సంబంధించి మోసాలు బయటపడిన సందర్భాల్లో కూడా విదేశీయులను వారి వారి సొంత దేశాలకు పంపేందుకు కెనడా సిద్ధమైంది.
దేశంలోకి విపరీతంగా వలసలు పెరిగిపోవడంతో వాటిని తగ్గించేందుకు ఇటీవల కాలంలో కెనడా అనేక ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా అంతర్జాతీయ విద్యార్థి వీసాల జారీని తగ్గించింది. జీవిత భాగస్వామి వర్క్ పర్మిట్ల జారీ నిబంధనలను కూడా కఠినతరం చేసింది. తాత్కాలిక ఉపాధి కోసం వచ్చే విదేశీయుల నిబంధనలను మరింత కఠినం చేసింది. అయితే కెనడా ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై కెనడా ప్రభుత్వ విధానాల ప్రభావం ఎక్కువగా ఉంటోందనేది వాస్తవం. దీంతో డిపోర్టేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. కెనడాలో ఉన్న వారితో పాటు భారత్‌లో ఉంటున్న ఎన్నారైల కుటుంబాల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. డిపోర్టేషన్తో తాము డబ్బు, విలువైన సమయం కోల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వలసల నివారణం కోసం డిపోర్టేషన్ల విషయంలో కెనడా ప్రభుత్వం ఇదే విధానాన్ని మరింత కాలం పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విద్యార్థి వీసాలపై కెనడాలో పైచదువులకు దరఖాస్తు చేసుకునే వారు అక్కడి విద్యాసంస్థల ట్రాక్ రికార్డు, తమ డాక్యుమెంట్స్‌లో ఎలాంటి లోపాలు లేకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని నిపణులు చెబుతున్నారు.









