
పూర్వం రోజుల్లో రాగి పాత్రలు, కాపర్ బాటిళ్లలో నీళ్లు ఎక్కువగా తాగేవారు. అయితే రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ నీటిని సరైన పద్ధతిలో సరైన కొలతలో తీసుకోకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి నీళ్లు తాగడం వల్ల ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే అజీర్తి, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రాగిలో ఉండే గుణాలు నీటిలోని హానికర బాక్టీరియాను చంపేసి, మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడం, బీపీని అదుపులో ఉంచడం, కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా రాగి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
అయితే నీళ్లను రాగి పాత్రలో పెట్టిన వెంటనే తాగేయకూడదు. కనీసం 6 నుండి 8 గంటల పాటు ఆ పాత్రలోనే ఉంచాలి. అప్పుడే రాగిలోని మంచి గుణాలు నీటిలోకి చేరుతాయి. రాత్రి పూట నీళ్లు పోసి మూతపెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగడం చాలా మంచి పద్ధతి. అంతేకానీ 24 గంటలకు పైగా నీటిని అలాగే రాగి పాత్రలోనే ఉంచి తాగకూడదు. రోజంతా కేవలం రాగి నీళ్లే తాగడం అసలు మంచిది కాదు. రోజూ పొద్దున్నే 1 లేదా 2 గ్లాసులు తాగితే సరిపోతుంది. రోజంతా ఇవే నీళ్లు తాగితే శరీరంలో కాపర్ ఎక్కువైపోయి కడుపునొప్పి, వికారం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు లివర్, కిడ్నీలపై కూడా చెడు ప్రభావం పడవచ్చు.
రాగి పాత్రలు వాడేటప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కాపర్ బాటిళ్లలో నిమ్మరసం, మజ్జిగ, లేదా ఏవైనా పండ్ల రసాలు ఎప్పుడూ పోయకూడదు. అవి రాగితో కలిసి విషంగా మారే ప్రమాదం ఉంది. నీటిని ఎప్పుడూ మామూలు రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి కానీ ఫ్రిజ్లో పెట్టకూడదు. అలాగే భోజనం చేసిన వెంటనే ఈ నీళ్లు తాగకపోవడమే మంచిది. రాగి పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రాగి త్వరగా నల్లబడిపోతుంది. కాబట్టి రోజూ మామూలు నీళ్లతో కడగాలి. వారానికి ఒకసారైనా నిమ్మకాయ, ఉప్పు లేదా చింతపండుతో బాగా రుద్ది కడిగితే పాత్ర మెరిసిపోవడమే కాకుండా నీళ్లు కూడా ప్యూర్ గా ఉంటాయి.









