
Vimal Ad : బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవ్‌గణ్, షారూఖ్ ఖాన్ , టైగర్ ష్రాఫ్‌లకు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన సంస్థ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరు నటించిన విమల్ ఎలైచీ యాడ్ పై ఎఫ్‌డీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నిషేధించబడిన విమల్ పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేసేలా ఈ ప్రకటన ఉందని ఆరోపిస్తూ రెగ్యులేటర్ ఈ చర్యలు తీసుకుంది. మహారాష్ట్రలో గుట్కా, పాన్ మసాలా అమ్మకాలు, వాటి యాడ్స్‌పై కఠినంగా ఉంటున్న అధికారులు, ఇప్పుడు ఈ స్టార్ హీరోల పాత్రపై నిలదీస్తున్నారు.
ఈ వారం పంపిన నోటీసుల్లో, ఈ యాడ్‌లో ఎందుకు నటించారో వివరణ ఇవ్వాలని అజయ్, షారూఖ్, టైగర్లను అధికారులు కోరారు. ఈ యాడ్ చూడటానికి ఎలైచీ లాగే ఉన్నా, జనాలు విమల్ పాన్ మసాలానే గుర్తుతెచ్చుకుంటారని అధికారులు తెలిపారు. చట్టం ప్రకారం ఇది నిషేధించిన వస్తువులను పరోక్షంగా ప్రచారం చేయడమే అవుతుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2026 జూలై 13 నుంచి ఒక ఏడాది పాటు పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలను పూర్తిగా బ్యాన్ చేసింది. ఇలాంటి టైమ్‌లో ఈ యాడ్ రావడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్పారు.
ఇలా దొంగ దారిన చేసే యాడ్స్‌పై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ యాడ్‌లో హీరోలు చెప్పే డైలాగులు, సీన్లు, విమల్ అనే పేరును వాడుతున్న తీరు చూస్తుంటే.. ఇది కచ్చితంగా బ్యాన్ చేసిన పొగాకు ప్రాడక్ట్‌ను ప్రచారం చేయడమేనని అధికారులకు గట్టి అనుమానం వచ్చింది. అందుకే ఈ ముగ్గురు బాలీవుడ్ హీరోలకు నోటీసులు జారీ చేసి వివరణ అడిగారు.









