LPG production : అమెరికా, ఇరాన్ యుద్ధం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధిపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండటంతో వంటగ్యాస్ విషయంలో అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు. మనదేశంపై గతంలో ఎన్నడు లేనివిధంగా ఈ ప్రభావం పడటంతో ఒక దశలో వంటగ్యాస్ దొరకక రెస్టారెంట్లు మూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో భవిష్యతులో ఇలాంటి పరిణామాలు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దు మణిగేలా లేవు. దీంతో గ్యాస్‌ కొరత ముందు ముందు కూడా తప్పకపోవచ్చన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మనదేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి చేస్తున్న పబ్లిక్‌, ప్రైవేట్‌రంగ రిఫైనరీలకు, చమురు వెలికితీసే కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించింది. గతంలో ప్రభుత్వం ఎప్పుడు ఇలా లక్ష్యాలు పెట్టలేదు. అయితే ప్రస్తుతం ఉన్న అవసరాల రీత్య ఇలా లక్ష్యాలను నిర్దేశించక తప్పని పరిస్థితి, అవసరమైతే దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు వీలైనంత వరకు ఇక్కడే సమకూర్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు తాజాగా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అధికారులు ఆయా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 21 కంపెనీలకు రోజుకు 63,810 టన్నులు ఎల్‌పీజీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు.

గతంతో పోలిస్తే దేశీయంగా ఎల్‌పీజీ వినియోగం భారీగా పెరిగింది.కానీ, పెరిగిన వినియోగానికి తగిన రీతిలో మనవద్ద నిల్వలు ఉండటం లేదు. వాతావరణ కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించింది. దీంతో అన్ని ఇళ్లలో వంట గ్యాస్‌ వినియోగం పెరిగింది. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే మనదేశంలో 33.2 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీని భారత్‌ వినియోగించినట్లు తేలింది. అంటే రోజుకు సగటున సుమారు 91 వేల టన్నుల వినియోగం అవుతుందని తెలుస్తోంది. అయితే దేశీయంగా కేవలం 13.1 మిలియన్‌ టన్నులు, అంటే రోజుకు 35,900 టన్నులు మాత్రమే మనదేశంలో ఉత్పత్తి . జరిగింది. మిగిలిన 21.3 మిలియన్‌ టన్నులు (రోజుకు 58,400 టన్నులు) గ్యాస్‌ను విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అంటే విదేశాలపై 64 శాతం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి గతంలో ఎప్పుడు గ్యాస్‌ దిగుమతికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. కానీ, అమెరికా- ఇరాన్‌ మధ్య యుద్ధం కారణంగా హర్మూజ్‌ జలసంధి మూతపడటంతో ప్రభావం పడింది. దేశీయ అవసరాలకు దిగుమతి చేసుకునే ఎల్‌పీజీలో 90 శాతం ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతుందన్నది తెలిసిందే. ఈ కీలక రవాణా మార్గం మూతపడడంతో మనం తీవ్ర వంట గ్యాస్‌కు తీవ్ర కొరతను ఎదుర్కొన్నాం. ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్పటికప్పుడు దేశీయ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానితో పాటు కమర్షియల్‌ సిలిండర్‌ విక్రయాలపై కూడా ఆంక్షలు పెట్టింది. గృహ వినియోగ సిలిండర్‌ బుకింగ్‌ గడువునూ కూడా పెంచాల్సి వచ్చింది.

అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దేశీయంగా సరిపడా ఉత్పత్తి పెంచాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రిఫైనరీలు, చమురు వెలికి తీసే కంపెనీలకు ఎల్‌పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. మొత్తం 18 ప్రభుత్వరంగ రిఫైనరీలకు 31,470 టన్నుల ఎల్‌పీజీని ఉత్పత్తి చేయాలని రోజువారీ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించింది. ఇక ప్రైవేటు రంగంలో ఉన్న రిలయన్స్‌కు అత్యధికంగా 18 వేల టన్నుల ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టింది. అలాగే నయారా ఎనర్జీకి 4,480 టన్నులు, మహారత్నకు చెందిన ఓఎన్‌జీసీ, గెయిల్‌ కంపెనీలకు 6,460 టన్నులు ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. ప్రతి ఆరు నెలలకు జనవరి 1న, జులై 1న దేశీయ అవసరాలను అనుసరించి కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేసింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.