Jharkhand Student Protest : జార్ఖండ్ లో గడచిన నెల రోజులుగా జరుగుతున్న విద్యార్థుల ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని, పాత పరీక్షలు రద్దు చేయాలని, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ డిమాండ్లపై జేఎంఎం-కాంగ్రెస్ కూటమి “నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందని” ఆరోపిస్తూ, రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.అయితే సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 17) నాడు మరో విడత చర్చల కోసం నిరసనకారులను ఆహ్వానించింది.అయినా శాంతించని విద్యార్థులు ఈ నెల 20న ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.

కాగడాల ప్రదర్శన..

‘జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ ఆధ్యర్యంలో’ జరుగుతున్న ఈ ఆందోళనలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకోగా, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించటం గమనార్హం. ఈ సందర్బంగా జైపాల్ సింగ్ మొండా స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకూ విద్యార్థులు కాగాడాలు ప్రదర్శించి, అక్కడ రాహుల్ గాంధీ, సీఎం సోరెన్ దిష్టి బొమ్మలు దహనం చేయడం కలకలం రేపింది. ఈ దిష్టిబొమ్మల దహనం జార్ఖండ్ లోని వివిధ జిల్లాలకు సైతం పాకింది. ఆయా జిల్లాలలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో పాటు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

Also Read : ఇన్‌స్టాలో దిమాగీ నక్సల్ పార్టీ సంచలనం.. ఒక్కరోజులోనే 1.6 లక్షల ఫాలోవర్స్!

తాజా చర్చలకు ఆహ్వానం

కాగా రాష్ర్టంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, జార్ఖండ్ ప్రభుత్వం నిరసనకారులను సోమవారం చర్చల కోసం ప్రతినిధులను ఆహ్వానించింది. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసనకారులు, సబ్-డివిజనల్ ఆఫీసర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (శాంతిభద్రతలు) మధ్య జరిగిన సమావేశం అనంతరం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. విద్యార్థులను వారి న్యాయ సలహాదారుతో పాటు చర్చల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ‘జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్’ స్టేట్ గెస్ట్ హౌస్‌లో చర్చల కోసం ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించింది. చర్చలకు వెళ్లినంత మాత్రాన తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని వారు తేల్చి చెప్పారు. “మేము ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నాము కాబట్టి, కచ్చితంగా చర్చలకు వెళ్తాము. నియామక పరీక్షలలోని అవకతవకలపై సీబీఐ విచారణ, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలను రద్దు చేయడం అనే మా రెండు డిమాండ్ల విషయంలో మేము దృఢంగా ఉన్నాము” అని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మీడియాతో అన్నారు.

సీఎం నివాసం ముట్టడికి పిలుపు

చర్చలకు పిలిచినప్పటికీ ఆగస్టు 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు జార్ఖండ్ నలుమూలల నుంచి విద్యార్థులు రాంచీలో సమావేశం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “జేఎంఎం, కాంగ్రెస్ రెండూ మాతో రాజకీయాలు చేస్తున్నందున, మేము సీఎం రాజీనామా కోరుతున్నాము” అని పాశ్వాన్ ఆరోపించారు. తమ ఆందోళనలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే, జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతును ఉపసంహరించుకోవాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

Also Read : గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టె దిశగా కేంద్రం అడుగులు.. దేశీయ కంపెనీలకు టార్గెట్

విద్యార్థులతో మాట్లాడండి.. రాహుల్‌ గాంధీ

కాగా, జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు విషయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఆయన కోరారు. ఈ మేరకు సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు. విద్యార్థుల ఆందోళన ఇప్పటివరకు శాంతియుతంగానే సాగుతోందని, వారి డిమాండ్లు న్యాయమైనవని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొనడం గమనార్హం

‘గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది జార్ఖండ్‌లోని పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి స్వయంగా విద్యార్థులను కలిసి వారి సమస్యలను వినాలి. ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి’ అని రాహుల్ తన లేఖలో కోరారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.