
Cauvery Water : తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల మధ్య నెలకొన్న కావేరి నది నీటి విడుద వివాదంపై సుప్రీం కోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడంపై కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (CWMA) ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా కర్ణాటకను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఇక నీటి విడుదల కోసం దిశానిర్దేశం చేయాలని కోరుతూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈలోగా కర్ణాటక విడుదల చేసిన నీటికి సంబంధించి తాజా సమాచారాన్ని కోర్టు ముందు ఉంచవచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
Also Read : డీకే అరుణ. లక్ష్మణ్ ఔట్.. పురందేశ్వరికి ప్రమోషన్.. టీబీజేపీ నేతలకు హైకమాండ్ బిగ్ షాక్!
వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, తన వాటాకు రావాల్సిన కావేరీ నీరు అందడం లేదని పేర్కొంటూ తమిళనాడు ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కావేరీ నీటి నియంత్రణ కమిటీ విడుదల చేయాలని సిఫార్సు చేసిన పరిమాణం, అలాగే కర్ణాటక వాస్తవంగా సరఫరా చేసిన నీరు రెండూ తమ అవసరాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. కేఆర్ఎస్, కబిని జలాశయాల క్యాచ్మెంట్ (జలగ్రహణ) ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల తమ రాష్ట్రానికి రావాల్సిన నీటి పరిమాణం పెరిగిందని తమిళనాడు సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది.
ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. బిలిగుండ్లు వద్ద అందాల్సిన దామాషా వాటా 26.954 టీఎంసీలుగా ఉండాలి. జూలై 28న జరిగిన సమావేశంలో జూలై 29 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి నియంత్రణ కమిటీ కర్ణాటకను ఆదేశించింది. అయితే, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని బిలిగుండ్లు వద్ద నమోదు చేయబడిన వాస్తవ నీటి ప్రవాహం 158 నుండి 550 క్యూసెక్కుల మధ్య మాత్రమే ఉందని తమిళనాడు వాదించింది.
కర్ణాటకలో ఉన్న నాలుగు జలాశయాల్లోని నీటి నిల్వ పరిమాణాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం ఉదహరించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కృష్ణరాజ సాగర్, కబిని, హరంగి, హేమావతి జలాశయాల్లో కలిపి మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా తమిళనాడుకు రావాల్సిన వాటాను కర్ణాటక విడుదల చేయవచ్చని తెలిపింది. తమిళనాడు వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ మేరకు కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని తీర్పునిచ్చింది.
Also Read : ఇన్స్టాలో దిమాగీ నక్సల్ పార్టీ సంచలనం.. ఒక్కరోజులోనే 1.6 లక్షల ఫాలోవర్స్!









