
22A Prohibited Land Issues In Telangana : 22-A భూమి అనేది భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల చట్టం. రిజిస్ట్రేషన్ల చట్టం1908 సెక్షన్ 22(a)/22(b)/22(c)/22(d)/22(e) క్రింద కొన్ని కేటగిరీ లకు చెందిన భూములు అమ్ముట కొనుట ఎటువంటి లావాదేవీలు రిజిస్ట్రేషన్ చేయుట నిషేదింబడింది.వీటినే నిషేధిత భూములు అని అంటారు. 22-A ప్రకారం, ఈ భూములను నాలుగు విభాగాలుగా విభజించారుజ.1. ప్రభుత్వ భూములు – ప్రభుత్వ అవసరాల కోసం ఉన్న భూములు. 2. అటవీ భూములు – అటవీ ప్రాంతాల్లో ఉన్న భూములు.3. బెనామీ భూములు – నిర్దిష్ట యజమాని లేని భూములు. 4. చారిత్రాత్మక,మతపరమైన ప్రదేశాలు – ఆలయాలు లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలకు సంబంధించిన భూములు ఈ చట్టం పరిధిలో ఉన్నాయి. నిషేధిత భూములు అనగా ప్రభుత్వ లేదా ఇతర ప్రాముఖ్యత గల వాటి కోసం రిజర్వు చేయబడ్డ భూములని అర్థం. ఈ నిషేధిత భూములను సాధారణ ప్రజలు కొనుగోలు చేయడానికి గానీ, విక్రయించడానికి గానీ లేదా వ్యక్తిగత ఉపయోగానికి వాడుకోవడం గానీ చేయడానికి అనుమతించరు. నిషేధిత భూములు ముఖ్యంగా ప్రభుత్వ, రక్షణ, వన్యప్రాణి అభయారణ్యం, నదీ తీరాలు, ఇతర సామాజిక అవసరాలకు సంబంధించినవి కావచ్చు.
చెరువులు, గెడ్డలు,రోడ్లు కాలువలు శ్మశానం,రాస్తాలు వంటి పోరంబోకు భూములు పట్టా ఇచ్చిన,ఇవ్వని గవర్నమెంట్ బంజరు భూములు ప్రభుత్వ అవుసరం కోసం రైతులు నుండి అక్వైరు చేసిన లాండ్ అక్విజిషను భూములు,ఇతర గవర్నమెంట్ స్థలాలు, లాండ్ సీలింగ్ ఆక్ట్ కింద ప్రభుత్వం వారికి స్వాధీనం చేయబడిన సీలింగ్ మిగులు భూములు, దేవాదాయ భూములు,వివిధ ప్రాజెక్టులకు చెందిన భూములు ఇవన్నీ కూడా నిషేధిత భూముల కేటగిరీ కిందికి వస్తాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి భూములు సర్వే నెంబర్ తో రాయబడిన డాక్యుమెంట్ ఏదీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించరు.
22-A చట్టం పరిధిలో ఉన్న భూములను కొనడం, లేదా అమ్మడాన్ని ప్రభుత్వం స్పష్టంగా నిషేధించింది. ఈ భూములను కొనుగోలు చేయాలనుకుంటే, సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. ఇది ఎక్కువగా తప్పుడు భూమి లావాదేవీలను నియంత్రించడానికి,ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి ఏర్పాటు చేయబడింది.
Also Read : జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు!
కాగా, తెలంగాణ రాష్ట్రంలో 22 ఏ(నిషేధిత భూములు) జాబితాలోకి ప్రైవేట్ భూములు, ఆస్తులు కూడా చేరడంతో వాటి యజమానులలో గందరగోళం నెలకొంది. విద్య, వివాహాల వంటి అత్యవసర అవసరాల కోసం ఈ స్థిరాస్తులను విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి వీలు లేకుండా పోవడంతో వాటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో ఇటీవలి పరిణామాలు వారిలో మరింత ఆందోళనను పెంచుతున్నాయి. వ్యవసాయ లేదా వ్యవసాయేతర భూములైనప్పటికీ ఈ నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు.
కాగా, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవ్వడం, రిజిస్ట్రేషన్ల ద్వారా చేతులు మారడం వంటి వివాదాలను గమనించిన రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం హైకోర్టు నిషేధిత భూముల జాబితాను నవీకరించాలని డిసెంబర్ 2015లో ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024లో కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ 2025 చివర్లో ప్రభుత్వ భూముల వివరాలను నవీకరించి వాటిని నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఆర్డీవో, తహసీల్దార్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలతో కూడిన జాబితాలను రూపొందించి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో అధికారులు నాడు అప్లోడ్ చేశారు. ఈ జాబితా ఆధారంగా అందులో ఉన్న సర్వే నంబర్లకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను రిజిస్ట్రేషన్ శాఖ నిలిపివేసింది
అదే సందర్భంలో వేలం ద్వారా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఆస్తులు, క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా పట్టాలు పొందిన భూములు, అలాంటి తదితరాలను ప్రైవేట్ ఆస్తులుగా పరిగణిస్తారు. కానీ, రెవెన్యూ రికార్డులు ఆయా భూముల మూల సర్వే నంబర్లను ప్రభుత్వ ఆస్తిగానే చూపుతాయి. అయితే రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం బైనంబర్లు, లేఅవుట్ ప్లాట్ నంబర్లను ఇస్తూ రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీలను చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ సర్వే నంబర్లన్నీ 22 ఏ జాబితాలో చేరడంతో మూల సర్వే నంబర్లకు అనుసంధానంగా ఉండే భూములు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి. కోర్టు ఆదేశాల ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయినప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఆయా భూములకు సంబంధించిన మార్పులు నమోదు చేయకపోవడం గమనార్హం. అలాగే 166, 59 జీవోల కింద క్రమబద్ధీకరణ చేయబడి, రిజిస్టర్ అయిన ప్లాట్ల సర్వే నంబర్లను కూడా అధికారులు రికార్డుల నుంచి తొలగించకపోవడంతో అవి నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోవడంతో గందరగోళం నెలకొంది.
ఉదాహారణకు సరూర్‌నగర్ మండలంలో సర్వే నంబర్ 39లోని భూమి 22 ఏలో ఉండటం వల్ల ఓ ఇంటి రిజిస్ట్రేషన్‌కు అనుమతించలేదు. ఆ ఇల్లు సర్వే నంబర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి రావడం వల్లే 22 ఏ జాబితాలో చేరిందని గుర్తించారు. అదే మండలంలో 19/పీ నుంచి 46 వరకు ఉన్న అనేక సబ్ నంబర్లు 22 ఏ జాబితాలో చేరడం గమనార్హం ఇవే కాక వికారాబాద్‌లోని ఎన్నెపల్లి,శివారెడ్డిపేట, ఆలంపల్లి, లంకా ప్రతాప్‌రెడ్డి కాలనీ ప్రాంతాల్లోని వివిధ ప్లాట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నివాసాలు కూడా నిషేధిత జాబితాలో చేరడం ఆందోళన కలిగించే అంశం.
ఉప్పల్, నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోకి వచ్చే నారపల్లి, మేడిపల్లి, రామంతాపూర్, ఉప్పల్ భగాయత్‌తో పాటు చాలా ప్రాంతాల్లోని సర్వే నంబర్లలోని ఆస్తులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ జరగడం లేదు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి జిల్లాలతో పాటు గ్రామీణ జిల్లాల నుంచి కూడా 22 ఏ ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ భూ సర్వే నంబర్లతో అనుసంధానంగా ఉన్న భూదాన్, అసైన్డ్, భూ పంపిణీ, సీలింగ్ భూముల పట్టా భూముల విషయంలోనే ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read : 90 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల కమిషనర్ సంచలన ప్రకటన









