
Imran Khan : అవినీతి ఆరోపణలతో జైలు జీవితం అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73)కు గొప్ప ఊరట లభించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశ అత్యున్నత న్యాయన్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన ఆరోగ్యం దృష్ట్యా ఆసుపత్రిలో చేర్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గత కొంతకాలంగా ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణిస్తుందన్న వైద్య నివేదికలను ఉటంకిస్తూ.. కుటుంబ సభ్యులు, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (PTI) నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, న్యాయస్థానం ఆదేశాన్ని పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ ఈ చర్యలు ముందే తీసుకొని ఉంటే ఆయన ఆరోగ్యం ఇంతగా క్షీణించి ఉండేది కాదని ఆసహానం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు ఆయనను ప్రైవేట్ వైద్యుల సంరక్షణలోనే ఉంచాలని కుటుంబ సభ్యులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై పాక్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ వైద్య నివేదికలను తాను నిపుణులతో కలిసి పరిశీలించానన్నారు. వాటిప్రకారం.. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని వారు చెప్పినట్లు వివరించారు. మూడేళ్ల జైలు జీవితం, ఒంటరితనం వల్ల ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడి, మానసిక, శారీరక సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇమ్రాన్ ఖాన్ నాకు 35 ఏళ్లకు పైగా తెలుసు. రాజకీయంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆయన ఏనాడు ఒత్తిడికి గురికాలేదు. కానీ, మూడేళ్ల జైలు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత ఏడు నెలలుగా తన కుటుంబం, పార్టీ నేతలు ఎలా ఉన్నారనే ఆందోళన, బయట అసలేం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. అందుకే ఇమ్రాన్ రోజురోజుకు మరింత కుంగిపోతున్నారు’ అని అల్వీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పీటీఐ పార్టీ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ అల్-ఖాదిర్ ట్రస్ట్, ప్రభుత్వ బహుమతుల కేసుల్లో అవినీతికి పాల్పడటం, అధికారిక ప్రభుత్వ రహస్యాల లీక్ చేయడం, చట్టవిరుద్ధంగా వివాహం చేసుకోవడం సహా పలు నేరారోపణలు, పెండింగ్ కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.









