
చైనాలో రోబోల రేస్ ఇప్పుడు మరో లెవల్‌కి వెళ్లింది. రోబోలు ఇంటి పనుల నుంచి రన్నింగ్, లాంగ్‌జంప్, షటిల్ వరకు.. మనిషిలా పనులను చేయడం మొదలుపెట్టాయి. మరి చైనా ఇంత భారీగా హ్యూమనాయిడ్ రోబోలపై ఎందుకు దృష్టి పెడుతోంది..? అసలు వీటి టార్గెట్ ఏంటి..? ఈ రోబోలు ఎంత వరకు సేఫ్..? అనేది ఈస్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.
చైనాలో రోబోల పరీక్షలు ఇప్పుడు కొత్త దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు రోబోలకు ముందే ఒక పని అప్పగించి.. అదే పని చేయించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితికి తగ్గట్టు తన పని తాను మార్చుకునేలా రోబోలను పరీక్షిస్తున్నారు. బీజింగ్‌లో ఆగస్టు 22 నుంచి 26 వరకు జరిగే రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో 16 దేశాల నుంచి 666 జట్లు.. 2,056 రోబోలు పాల్గొంటున్నాయి. ఇంటి పనుల నుంచి రన్నింగ్, లాంగ్‌జంప్, షటిల్ వరకు పోటీలు ఉంటాయి. ఇంటి పనుల్లో లివింగ్ రూమ్ సర్దడం.. బట్టలు సర్దడం.. బట్టలు ఉతికి ఆరేయడం.. మధ్యలో పార్సిల్ వస్తే తీసుకెళ్లి మళ్లీ ఆపిన పనిని కొనసాగించడం వంటి టాస్క్‌లు ఇస్తున్నారు.
అయితే ఈ పరీక్షలు ఇంటి పనులతోనే ఆగిపోవడం లేదు. రోబో మనిషిలా కదలగలదా.. బ్యాలెన్స్ చేసుకోగలదా.. ఒక్కసారిగా పరిస్థితి మారితే వెంటనే స్పందించగలదా అన్నదీ చూస్తున్నారు. అందుకే గేమ్స్‌లో రోబోలను స్పోర్ట్స్‌లోనూ పరీక్షిస్తున్నారు. రన్నింగ్‌లో ఎంత వేగంగా పరిగెత్తగలదో.. లాంగ్‌జంప్‌లో ఎంత దూరం దూకగలదో.. షటిల్ ఎలా ఆడుతుందో పరీక్షిస్తున్నారు. కేవలం మనిషిలా కనిపించే రోబోను తయారు చేయడం కాదు.. మనిషిలా పని చేసే రోబోను తయారు చేయాలని చైనా చూస్తోంది. ఎందుకంటే ఇంట్లో అయినా.. ఫ్యాక్టరీలో అయినా.. ప్రతిసారీ పరిస్థితి ఒకేలా ఉండదు. అందుకే ముందే ప్రోగ్రామ్ చేసిన పనికే పరిమితం కాకుండా.. ఎదురైన పరిస్థితిని అర్థం చేసుకుని.. దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకునేలా రోబోలకు ట్రైనింగ్ ఇస్తోంది.
చైనా ఇంత దూకుడుగా ముందుకెళ్లడానికి ప్రధాన కారణం.. జనాభా మార్పు. చైనాలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో పని చేసే వయసులో ఉన్న జనాభా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. దీంతో ఫ్యాక్టరీలు, గోదాములు, లాజిస్టిక్స్, కొన్ని సర్వీస్ రంగాల్లో పనిచేసే మనుషుల కొరత వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్యకు ముందుగానే టెక్నాలజీతో పరిష్కారం వెతుకుతోంది చైనా. అందుకే మనుషులు చేసే కొన్ని పనులను రోబోలతో చేయించేందుకు ఇప్పటి నుంచే వాటిని సిద్ధం చేస్తోంది.
ఇక దీనికి తోడు చైనా భారీ తయారీ రంగానికి కూడా రోబోలు చాలా ఉపయోగపడతాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటి. వేల ఫ్యాక్టరీలు.. భారీ గోదాములు.. లక్షల రకాల ఉత్పత్తులు.. వీటన్నింటిలోనూ ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాక్సులు ఎత్తడం.. వస్తువులు సర్దడం.. ప్యాకింగ్ చేయడం.. సరుకులను ఒక చోట నుంచి మరో ప్లేస్‌కు తీసుకెళ్లడం.. ఇలాంటి పనుల్లో రోబోలు ఉపయోగపడితే మనుషులపై ఆధారపడటం తగ్గుతుంది.. ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది.. పని వేగం పెరుగుతుంది. ముఖ్యంగా రోజుకు 24 గంటలు రోబోలతో పని చేయించగలిగితే.. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే చైనా ఫ్యాక్టరీలకు ఇది పెద్ద అడ్వాంటేజ్‌గా మారుతుంది.
Also Read : అమెరికాలో 9/11 కంటే ఘోరమైన కుట్ర: పేలుళ్లకు ప్లాన్ చేసిన మహిళ అరెస్ట్!
ఇలాంటి భారీ తయారీ వ్యవస్థలో రోబోలు ఉపయోగపడాలంటే.. అవి ఫ్యాక్టరీ పనులకే పరిమితం కాకుండా.. మనుషులు పనిచేసే సాధారణ ప్రదేశాల్లోనూ కదలగలగాలి. తలుపులు తీయడం.. మెట్లు ఎక్కడం.. టేబుల్, కిచెన్ దగ్గర పని చేయడం.. ఇలా మనిషి చేసే పనులను రోబో కూడా చేయగలిగితే వాటి ఉపయోగం మరింత పెరుగుతుంది. అందుకే రెండు కాళ్లు, రెండు చేతులతో మనిషి శరీర నిర్మాణానికి దగ్గరగా ఉండే హ్యూమనాయిడ్ రోబోలపై చైనా ఫోకస్ పెంచుతోంది. కానీ రోబోను తయారు చేయడం ఒక ఎత్తయితే.. అది నిజంగా ఉపయోగపడే స్థాయికి తీసుకురావడం మరో ఎత్తు. అందుకోసం రోబో ఎంత బలంగా ఉందో మాత్రమే కాదు.. ఎంత వేగంగా పని చేస్తుంది, ఎంతసేపు పనిచేయగలదు, బ్యాటరీ ఎంతకాలం వస్తుంది, ఒక్కో రోబో తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది.. ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి.
ఇక ఈ రోబోల సామర్థ్యం పెరగడంలో AI టెక్నాలజీ కీలకంగా మారుతోంది. రోబో ఎంత బలంగా ఉన్నా.. ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతే ఉపయోగం ఉండదు. అందుకే రోబోకు కదలికలు ఇవ్వడమే కాదు.. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది అర్థం చేసుకునే AIని కూడా జోడిస్తున్నారు. అదే హ్యూమనాయిడ్ రోబోల్లో AIకి శరీరం వచ్చినట్టుగా మారుతోంది. మీరు “టేబుల్‌పై ఉన్న బాటిల్ తీసుకురా” అంటే.. టేబుల్‌ను గుర్తించాలి.. బాటిల్‌ను గుర్తించాలి.. దాన్ని ఎలా పట్టుకోవాలో నిర్ణయించాలి.. వెళ్లి తీసుకుని తిరిగి రావాలి. అంటే AI కంప్యూటర్లో సమాధానాలు చెప్పడం దగ్గరే ఆగిపోకుండా.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుని.. అక్కడే పని చేసే స్థాయికి వెళ్తోంది.
మరి ఇలాంటి రోబో తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది..? ప్రస్తుతం అన్ని హ్యూమనాయిడ్ రోబోలు ఒకే ధరలో లేవు. చైనాలోని కొన్ని కంపెనీలు కొన్ని మోడళ్లను లక్షల రూపాయల స్థాయిలోనే తీసుకొస్తున్నాయి. అయితే అధునాతన మోడళ్ల ధర మాత్రం దాదాపు 30 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఇంత ఖర్చుతో రోబోలను భారీగా వినియోగించడం అంత సులభం కాదు. అందుకే చైనా ఉత్పత్తి పెంచి.. తయారీ ఖర్చును తగ్గించే దిశగా వెళ్తోంది. ఎక్కువ రోబోలు తయారైతే.. ఒక్కో రోబో ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోల విషయంలోనూ చైనా అదే మార్గాన్ని అనుసరించాలని చూస్తోంది.
ధర తగ్గితే.. రోబోలను పెద్ద సంఖ్యలో ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఫ్యాక్టరీల్లో వీటితో ప్రయోగాలు జరుగుతున్నాయి. గోదాముల్లో సరుకులు సర్దడం.. హోటళ్లలో కొన్ని సర్వీస్ పనులు.. ఆసుపత్రుల్లో సహాయక పనులు.. వృద్ధులకు ఇంట్లో కొన్ని పనుల్లో సాయం చేయడం వంటి వాటికి ఉపయోగించవచ్చు. అంతేకాదు ప్రమాదకరమైన చోట్ల ఇవి మరింత ఉపయోగపడొచ్చు. అగ్నిప్రమాదాలు.. విషవాయువులు.. రేడియేషన్ ఉన్న ప్రాంతాలు.. కూలిపోయే భవనాలు వంటి చోట్ల మనిషి ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టకుండా రోబోలను పంపించవచ్చు. అంటే మనుషుల పనిని పూర్తిగా తీసేయడం కంటే.. ప్రమాదకరమైన పనుల్లో ముందుగా రోబోలను ఉపయోగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే ఉపయోగాలు ఎన్ని ఉన్నా.. మనుషుల మధ్య రోబోలు పనిచేసేటప్పుడు భద్రతే పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఇంట్లో పని చేస్తూ బ్యాలెన్స్ తప్పితే.. పిల్లవాడిని ఢీకొంటే.. చేతిలోని వస్తువు కిందపడితే.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రోబో ఎంత తెలివిగా మారినా.. అది చివరికి ఒక భారీ యంత్రమే. అందుకే మనుషుల మధ్య పనిచేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండటం.. వస్తువులను అదుపుగా పట్టుకోవడం.. ప్రమాదాన్ని గుర్తిస్తే వెంటనే ఆగిపోవడం చాలా అవసరం. రోబో ఎంత సమర్థంగా పనిచేసినా.. మనిషికి ఎలాంటి ముప్పు లేకుండా పనిచేసినప్పుడే దాని ఉపయోగం ఉంటుంది.
భద్రత తర్వాత హ్యూమనాయిడ్ రోబోలపై ఎక్కువగా చర్చ జరుగుతున్న మరో విషయం ఉద్యోగాలు. రోబోలు చౌకగా మారి.. మనిషి కంటే వేగంగా పనిచేయడం మొదలైతే కొన్ని పనుల్లో మనుషుల అవసరం తగ్గొచ్చు. ముఖ్యంగా ప్యాకింగ్.. సార్టింగ్.. అసెంబ్లీ.. గోదాం పనులు.. కొన్ని సర్వీస్ ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రోబోల సామర్థ్యం ఇంకా పరిమితంగానే ఉంది. ఇవి ఖరీదైనవే కాకుండా.. అన్ని పరిస్థితుల్లోనూ మనిషిలా పని చేయలేవు. ముఖ్యంగా అనుకోని పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే దానికి తగ్గట్టు మారడం రోబోలకు ఇప్పటికీ పెద్ద సవాలే. అందుకే ప్రస్తుతం రోబోలు మొత్తం ఉద్యోగాలను భర్తీ చేసే స్థాయిలో కాకుండా.. కొన్ని పనుల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారే దిశలోనే ముందుకెళ్తున్నాయి.
మొత్తంగా ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్లో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా చైనా ముందుకెళ్తోంది. రోబో తయారీకి అవసరమైన మోటార్లు, సెన్సర్లు, బ్యాటరీలు, చిప్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ పార్ట్స్.. ఇలా చాలా భాగాల తయారీలో చైనాకు ఇప్పటికే భారీ సామర్థ్యం ఉంది. ఇప్పుడు అదే తయారీ బలాన్ని హ్యూమనాయిడ్ రోబోల రంగంలోకి తీసుకెళ్లి.. భవిష్యత్ రోబోటిక్స్ మార్కెట్లో ప్రపంచంలోనే ముందుండాలని చైనా చూస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి.. ప్రపంచ మార్కెట్లో చైనా ఎంతవరకు ఆధిపత్యం సాధిస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
Also Read : అప్పుల్లో అమెరికా సరికొత్త రికార్డు.. మరి ఇండియా పరిస్థితి ఏంటి?









