
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటి వేగం, ఆయుధ సామర్థ్యం, స్టెల్త్ సాంకేతికతతో గుర్తింపు పొందినప్పటికీ అమెరికాకు చెందిన F-22 రాప్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్‌గా చరిత్రకెక్కింది. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కాంట్రాక్టర్ లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన ఈ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్, తన అద్భుతమైన సామర్థ్యంతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తుంది. ఒక విమానం తయారీ వ్యయంతో పాటు పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి అయిన ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే ఒక్కో F-22 రాప్టర్ ధర వేల కోట్లకు చేరుకుంటుంది.
సాధారణంగా ఒక F-22 రాప్టర్ విమానాన్ని తయారు చేయడానికి సుమారు 143 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చవుతుంది. అయితే దీని పరిశోధన, రూపకల్పన, క్షేత్రస్థాయి పరీక్షల ప్రాజెక్ట్ వ్యయాన్ని కూడా చేర్చితే ఒక్కో విమానం తయారీ ఖర్చు సుమారుగా 330 నుండి 350 మిలియన్ డాలర్లు అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.3,000 కోట్లు అన్నమాట. ప్రారంభంలో అమెరికా వైమానిక దళం కోసం 750 విమానాలను ఉత్పత్తి చేయాలని భావించినప్పటికీ బడ్జెట్ పరిమితుల కారణంగా కేవలం 195 విమానాలను మాత్రమే తయారు చేశారు. ఉత్పత్తి సంఖ్య తగ్గిపోవడంతో ప్రాజెక్ట్ రీసెర్చ్ ఖర్చు మొత్తం ఈ పరిమిత విమానాలపైనే పడి ఒక్కో జెట్ ధర విపరీతంగా పెరిగింది.
F-22 రాప్టర్ విమానం అంత ఖరీదైనదిగా మారడానికి ప్రధాన కారణం అందులో ఉపయోగించిన అధునాతన సాంకేతికతే. ఈ జెట్ అత్యంత ప్రధానమైన ప్రత్యేకత దీని ‘స్టెల్త్ సామర్థ్యం’. అత్యంత శక్తివంతమైన శత్రు రాడార్లకు కూడా ఇది ఒక చిన్న పక్షిలా మాత్రమే కనిపిస్తుంది తప్ప యుద్ధ విమానంగా గుర్తించలేవు. అలాగే ఇంధనాన్ని అధికంగా వినియోగించే ఆఫ్టర్బర్నర్లను ఉపయోగించకుండానే ఇది సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. ఇందులో ఉన్న థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజిన్ల సహాయంతో గాల్లో వేగంగా, క్లిష్టమైన మలుపులను తిరుగుతూ శత్రు విమానాల దాడి నుండి సులభంగా తప్పించుకోగలదు.
ఈ విమానాన్ని కొనుగోలు చేయడం లేదా తయారు చేయడమే కాకుండా దానిని నిరంతరం పని చేసే స్థితిలో ఉంచడం కూడా అత్యంత ఖరీదైన వ్యవహారం. F-22 రాప్టర్ స్టెల్త్ కోటింగ్ దెబ్బతినకుండా ఉండేందుకు నిరంతరం ప్రత్యేక తనిఖీలు, మరమ్మతులు నిర్వహించాల్సి ఉంటుంది. దీని స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ కోసం అమెరికా వైమానిక దళం ఏటా మిలియన్ల డాలర్లు వెచ్చిస్తుంది. అమెరికా తన మరొక ఐదో తరం విమానమైన F-35 ను జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి మిత్రదేశాలకు విక్రయిస్తున్నప్పటికీ F-22 రాప్టర్ ఎగుమతిపై మాత్రం కఠినమైన నిషేధం విధించింది.









