
ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ వ్యూహాత్మకంగా కీలకమైన ..హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు పావులు కదుపుతోంది. వాషింగ్టన్తో (అమెరికాతో) ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధిని ఉపయోగించే ఓడలపై ఫీజులు విధించే దిశగా ఇరాన్ పార్లమెంట్ వేగంగా ముందడుగు వేస్తోంది. ఈ వ్యూహాత్మక జలసంధిలో తేహ్రాన్ అందించే పలు సేవలకై ఫీజులను వసూలు చేయడానికి అనుమతించే నిబంధనను పార్లమెంటరీ కమిషన్ ఆమోదించిన తర్వాత, హోర్ముజ్ జలసంధిని ఉపయోగించే నౌకలపై రుసుములను ప్రవేశపెట్టే దిశగా ఇరాన్ మరింత చేరువైంది.
గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇక్కడ ఇరాన్ ఒక మార్గం, అమెరికా మరోక భాగాన్ని ఎంచుకున్నాయి. అయితే ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు పరిశీలకులు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత “హోర్ముజ్ జలసంధి భద్రత , ప్రగతిని నిర్ధారించే వ్యూహాత్మక చర్య” ప్రణాళికలోని ‘ఆర్టికల్ 3’కి పార్లమెంటరీ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిషన్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని IRNA వార్తా సంస్థ తెలిపింది. ఈ నిబంధన ప్రకారం, జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల నౌకలు నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, కొన్ని పరిస్థితులలో ఇంధన సరఫరాలు, ఇన్సూరెన్స్,భద్రత వంటి అనేక సేవల కోసం చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉంటాయని తెలిపింది.అయితే కమిషన్ ఆమోదం తెలిపినంత మాత్రాన ఇది వెంటనే చట్టంగా మారదు. ఈ ప్రతిపాదన ఇరాన్ పార్లమెంట్ ముందు నిలిచి ఆమోదం పొందిన తర్వాత, ‘గార్డియన్ కౌన్సిల్’ పరిశీలించాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తేనే అధ్యక్షుడు దీనిని అధికారికంగా అమల్లోకి తెస్తారు.
తీరప్రాంత దేశ హక్కులను పేర్కొంటున్న ఇరాన్:
తీరప్రాంత దేశంగా తమకున్న హక్కులను1982 నాటి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందాన్ని (UNCLOS) ప్రస్తావిస్తూ కమిషన్ ప్రతినిధి హసన్ ఖష్ఖావి ఈ వసూలు ప్రతిపాదనను సమర్థించారు.”పర్షియన్ గల్ఫ్ ,హోర్ముజ్ జలసంధికి సంబంధించి స్వంత నిబంధనలు, నిబంధనావళులు ఉన్నాయి. 1982 నాటి సముద్ర చట్టాల ఒప్పందాన్ని అంగీకరించిన తర్వాత, ఒమన్ దేశం వెంటనే ఒక రాజకీయ ప్రకటనను జారీ చేస్తూ ఈ ఒప్పందంలోని నిబంధనలు తమ దేశ జాతీయ భద్రతకు లేదా సార్వభౌమత్వానికి భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది” అని ఖష్ఖావి పేర్కొన్నారు.
ఇక అమెరికా ఆర్తిక ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందించింది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించడం మరింత ఉద్రిక్తతలకు ఆస్కారంగా మారింది.అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది.
కాగా, ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినప్పటికీ.. హర్ముజ్పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.









