
ప్రపంచాన్ని ఎల్ నినో భయపెడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘ఎల్ నినో’ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్‌తో తోడై భూమిని చుట్టుముడుతోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయిలో అత్యంత శక్తిమంతమైన ఎల్ నినో రాబోతోందని యూకే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది గత రికార్డులన్నింటినీ తిరగరాసి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, కరువులకు దారితీయవచ్చని తెలిపింది. వాతావరణ మార్పులు, పారిశ్రామిక ఉద్గారాల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ ప్రకృతి ఉత్పాతానికి తోడవడంతో 2027వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏడాదిగా మారనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాలు, వర్షపాత విధానాలలో తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వర్షాలు సరిగ్గా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎల్ నినో అంటే ఏంటి?
పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. సాధారణంగా ప్రతి 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి సంభవించే ఈ అసాధారణ వాతావరణ పరిణామం దాదాపు ఏడాది పాటు తన ప్రభావాన్ని చూపుతుంది. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రంపై తూర్పు నుంచి పడమర దిశగా వీచే గాలులు బలహీనపడటం వల్ల వెచ్చటి నీరు తూర్పు పసిఫిక్ వైపు ప్రవహించి వాతావరణంలోకి విపరీతమైన ఉష్ణశక్తి విడుదలవుతుంది. సాధారణంగా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సగటు కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే శాస్త్రవేత్తలు దానిని ఎల్ నినోగా ప్రకటిస్తారు. కానీ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఏకంగా 2.6 డిగ్రీల సెల్సియస్ పైన నమోదవుతుండటంతో నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి ఇది 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌కు కూడా పెరిగే అవకాశం ఉందని యూకే మెట్ ఆఫీస్ తాజా అంచనాలు సూచిస్తున్నాయి. కేవలం ఉపరితలమే కాకుండా లోతైన సముద్రజలాల్లో దాదాపు 100 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ లోతైన వేడి నీరు ఒక పెద్ద రిజర్వాయర్ లాగా పనిచేస్తూ ఎల్ నినో సుదీర్ఘకాలం మరింత తీవ్రతరంగా కొనసాగడానికి అవసరమైన శక్తిని అందిస్తోంది.
గత 100 సంవత్సరాలు లేదా 500 ఏళ్ల సుదీర్ఘ కాలంలోనే ఇది అత్యంత బలమైన ఎల్ నినోగా నిలవవచ్చని అమెరికా రీసెర్చ్ గ్రూప్ ‘బెర్క్‌లే ఎర్త్’ క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ జేకే హౌస్‌ఫాదర్ పేర్కొన్నారు. 1950 నుంచి ఇప్పటివరకు ఇలా జరగలేదని తెలిపారు.
పసిఫిక్ మహాసముద్రం నుంచి విపరీతమైన వేడి గాలిలోకి విడుదలవ్వడం వల్ల గ్లోబల్ విండ్ ప్యాటర్న్స్ పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాల్లో వర్షపాతం సాధారణం కంటే తగ్గిపోతుంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తి తాగునీరు, సాగునీటి కొరత తీవ్రమై కరువు మేఘాలు అలుముకునే ప్రమాదం ఉంది.
ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో పెరిగి జలాశయాలన్నీ అడుగంటిపోతాయి. దీనివల్ల భయంకరమైన కరువులు రావడమే కాకుండా, కాకతాళీయంగా అడవుల్లో దారుణమైన కార్చిచ్చులు వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండే పెరు, ఈక్వెడార్, దక్షిణ అమెరికా, దక్షిణ యూఎస్ ప్రాంతాల్లో అసాధారణ రీతిలో మబ్బులు దట్టంగా పట్టి భారీ వర్షాలు కురుస్తాయి. దీనివల్ల నివాస ప్రాంతాలు మునిగిపోయి, వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. యూకే పరిసర ప్రాంతాల్లో అసాధారణ రీతిలో భారీ వర్షాలు, నాశనకరమైన చలిగాలులు, తుపానులు పెరిగే ముప్పుంది. అదే సమయంలో కరీబియన్, ట్రాపికల్ అట్లాంటిక్ ప్రాంతాల్లో సాధారణంగా వచ్చే తుపానుల వ్యవస్థ తీవ్రంగా మందగించింది.
ఎల్ నినో సమయంలో సముద్రాల నుంచి వెలువడే భారీ ఉష్ణశక్తి వాతావరణంలోకి ప్రవేశించడానికి కొంత సమయం పడుతుంది. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత భూమిపై ఉష్ణోగ్రతల ప్రభావం ఇంకా తీవ్రమవుతుందని మెట్ ఆఫీస్ క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ నిక్ డన్‌స్టోన్ వెల్లడించారు. దీనికారణంగా 2024లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డులన్నీ బద్దలు కొట్టి 2027వ సంవత్సరం భూమి చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన ఏడాదిగా నిలుస్తుందని తెలిపారు.
ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్’ తాజా నివేదిక ప్రకారం ఈ ఎల్ నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులు దెబ్బతిని వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ఇప్పటికే ఆకలి, పేదరికంతో అలమటిస్తున్న వెనుకబడిన దేశాల్లో నిత్యావసరాల ధరలు పెరిగి ఆహార భద్రత తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.









