రిటైర్మెంట్ తర్వాత రూపాయి కోసం ఎవరి ముందూ చేయి చాచకుండా, ప్రశాంతమైన జీవితం గడపాలంటే ముందుగానే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది 20 లేదా 30 ఏళ్ల వయసులోనే పెట్టుబడులు ప్రారంభిస్తారు, కానీ 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ మించిపోయిందేమీ లేదు. 40 ఏళ్ల వయసులో SIP ప్రారంభించి 60 ఏళ్ల నాటికి రూ. 1 కోటి రిటైర్మెంట్ కార్పస్‌ను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం.

40 ఏళ్ల వయసులో SIP ప్రారంభించి 60 ఏళ్ల నాటికి రూ.1 కోటి కార్పస్‌ను సాధించాలనుకునే వారికి 20 సంవత్సరాల (240 నెలలు) సుదీర్ఘ సమయం లభిస్తుంది. సగటున 12 శాతం వార్షిక రాబడి అంచనాతో నెలకు రూ.10,109 చొప్పున క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఈ 20 ఏళ్ల వ్యవధిలో మీరు మీ జేబు నుంచి పెట్టే మొత్తం పెట్టుబడి సుమారు రూ. 24.26 లక్షలు మాత్రమే కాగా, కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రభావం ద్వారా పొందే అంచనా లాభం సుమారు రూ. 75.74 లక్షలుగా ఉంటుంది. అంటే మీరు వేసిన పునాదికి కాంపౌండింగ్ తోడై 60 ఏళ్ల వయస్సు నాటికి మీ చేతికి రూ. 1 కోటి భారీ నిధి అందుతుంది.

మ్యూచువల్ ఫండ్స్ SIPలో మనం ప్రతి నెలా పెట్టే పెట్టుబడి మార్కెట్‌లో డిపాజిట్ అవుతుంది. దానిపై వచ్చే రాబడి కూడా తిరిగి మళ్లీ పెట్టుబడిగా మారి, రాబడిపై కూడా రాబడిని ఇస్తుంది. దీన్నే కాంపౌండింగ్ ప్రభావం అంటారు. ఇక్కడ అసలు రహస్యం మీరు ఎంత మొత్తం పెడుతున్నారనే దానికంటే, ఎంత ఎక్కువ కాలం (20 ఏళ్లు) క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం నెలకు రూ. 10,109 పెట్టుబడితో ప్రారంభించినప్పటికీ ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని కూడా 5% లేదా 10% పెంచుకుంటూ వెళ్లవచ్చు. దీన్నే ‘స్టెప్-అప్ SIP’ అంటారు. ఇలా చేయడం వల్ల మీ లక్ష్యమైన రూ.1 కోటి కంటే అతి త్వరగా, ఇంకా పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్‌ను కూడబెట్టే అవకాశం ఉంటుంది.

ద్రవ్యోల్బణం 20 ఏళ్ల తర్వాత రూ. 1 కోటి విలువ ఇప్పటి అంత ఉండదు. కాబట్టి మీ ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. మార్కెట్ రిస్క్ 12 శాతం రాబడి అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్‌కు స్థిరమైన రాబడి ఉండదు. మార్కెట్ పెరిగినా, తగ్గినా డిసిప్లిన్‌తో SIP కొనసాగించడం వల్ల దీర్ఘకాలంలో మంచి ప్రయోజనం ఉంటుంది.