
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని.. పోలీసుల హింస వల్లే జరిగిన లాకప్ డెత్ అని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టు అయిన కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని నెల్లూరు జైలుకు తరలించారు.
సిట్ నివేదిక ప్రకారం.. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించి మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. గత నెల మే 8న మార్కాపురంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించారు. సాయికృష్ణపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ.. చట్ట ప్రకారం 24 గంటల్లోగా అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారు. సాయికృష్ణ పీఎస్‌లోనే పోలీసుల కస్టడీలో ఉన్నాడని.. మే 6 నుంచి 8వ తేదీల మధ్య ఒక డెలివరీ బాయ్ కూడా అతడిని చూసినట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక ఎస్సై కూడా సాయికృష్ణను పీఎస్‌లోనే చూసినట్లు తెలిపారు. జూన్ 6 నుంచి 19వ తేదీ మధ్య కాలంలో పోలీసుల తీవ్ర వేధింపులు, గాయాల వల్లే సాయికృష్ణ లాకప్‌లోనే మరణించాడని సిట్ కోర్టుకు తెలిపింది.
సాయికృష్ణ చనిపోయిన తర్వాత కేసు నుంచి తప్పించుకోవడానికి సీఐ నాగరాజు బృందం అత్యంత దారుణమైన నేరానికి పాల్పడింది. సాయికృష్ణ మృతదేహాన్ని పీఎస్ నుంచే మాయం చేశారు. వీటికి సంబంధించిన ఆధారాలను మిస్సింగ్ చేయడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. మే 1 నుంచి జూన్ 1 వరకు ఒక నెల రోజుల పాటు పీఎస్‌లో అసలు ఫుటేజీలే లేకుండా మాయం చేశారు. ఈ ఫుటేజీలను ఎవరు, ఎందుకు మాయం చేశారనేది ఇంకా తేలాల్సి ఉందని సిట్ తెలిపింది. సాయికృష్ణ తమ అదుపులోనే లేడంటూ ఏకంగా హైకోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చి సీఐ నాగరాజు నిజాలను దాచారు. కొడుకు కనిపించడం లేదంటూ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డెడ్‌బాడీ ఎక్కడ దాచారో కనుక్కోవడానికి ఆయన్ను మళ్లీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టును కోరింది.









