
Ration Card : ఎల్‌నినో ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై బాగానే పడింది. దీంతో వర్షాలు తగ్గి.. పంటల దిగుబడిపై ప్రభావం పడుతోంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పేదలకు కొంత ఊరట కల్పించేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు మరికొన్ని సరుకులను తక్కువ ధరకే అందించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఇకపై బియ్యంతో పాటు మరికొన్ని నిత్యావసర సరుకులను కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆరు రకాల సరుకులు ఇచ్చే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండి ఉన్నాయి. ఈ సరుకులను మార్కెట్లో దొరికే ధర కంటే తక్కువకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒక్కో కుటుంబానికి ఎంత సరుకు ఇవ్వాలి? ఎంత ధర పెట్టాలి? ప్రతి నెలా ఇవ్వాలా? లేక కొన్ని నెలలకు ఒకసారి ఇవ్వాలా? అనే విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 3.42 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా సుమారు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కార్డుదారులకు ఇతర సరుకులు కూడా ఇవ్వాలంటే ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది. అందుకే ముందుగా పూర్తి లెక్కలు చూసి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
Also Read : ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం : కూలిన చెట్లు, స్తంభాలు, ఏడుగురు మృతి
మరోవైపు ఏపీలోనూ రేషన్ కార్డు ఉన్నవారికి తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించే పనులు జరుగుతున్నాయి. ప్రజలకు తక్కువ ధరకు సరుకులు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్‌ను తక్కువ ధరకు అందించాలని నిర్ణయించారు. దీపావళి నాటికి రేషన్ షాపుల ద్వారా కొన్ని సరుకులను తక్కువ ధరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమపిండి రూ.25 , లీటర్ పామాయిల్ రూ.125 ధరలకు అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో తక్కువ ధరకు బియ్యం అందించే చర్యలు చేపట్టారు. ధరణి బ్రాండ్ పేరుతో మొబైల్ వాహనాల ద్వారా ఫైన్, సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.49, రూ.50కు అందిస్తున్నారు. అలాగే బియ్యం ధరలు ఎక్కువగా పెరగకుండా మిల్లర్లు, వ్యాపారులతో అధికారులు మాట్లాడుతున్నారు. బీపీటీ స్టీమ్ బియ్యం కిలో రూ.66, సాధారణ స్టీమ్ బియ్యం కిలో రూ.47కు మించకుండా విక్రయించే అంశంపై కూడా చర్చించారు.
అంతేకాకుండా ఉల్లి ధరలు పెరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.35కే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో 800 టన్నుల ఉల్లిని తక్కువ ధరకు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు నుంచి మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలకు తక్కువ ధరకు సరుకులు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతోందని అధికారులు తెలిపారు.
Also Read : అర్నబ్ తుఫాన్‌పై ఏపీ హై అలర్ట్.. రూ.27 కోట్లు రిలీజ్.. స్కూళ్లకు సెలవులు!









