AP Rains : ఏపీ వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ వాయుగుండం ఇవాళ రాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ అలర్ట్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. కాకినాడ, గంగవరం, విశాఖ, కళింగపట్నం పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేయాలని అధికారులు సూచించారు. ఏపీ స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 1070కు కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

ఇక శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో శ్రీకాకుళంలోని పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ఇచ్ఛాపురంలో రెండు ఇళ్ల గోడలు కూలిపోయాయి. పోలాకి మండలంలో సుమారు 2 వేల ఎకరాల వరిపంట నీట మునిగింది. టెక్కలి భవానీనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రైల్వే అండర్‌పాస్‌లలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నౌపడ-పెద్దరాకలపల్లి మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, చింతలపాడు ప్రాంతాల్లోనూ భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు గ్రామం మొత్తం కకావికలమైంది. ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. భారీ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, స్తంభాలు రోడ్లపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర వాయుగుండం పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో ఏడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర, ఈశాన్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. రేపు మంచిర్యాల, కొమురంభీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో మాత్రం సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.