అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు గ్లోబల్ మార్కెట్లను భారీగా కుదిపేశాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ డెమోక్రటిక్ పార్టీ విజయదుందుభి మోగించడంతో టెక్ కంపెనీల స్టాక్స్ భారీగా కుప్పకూలాయి. ఫలితంగా ప్రపంచ కుబేరుల సంపద ఊహించని రీతిలో ఆవిరైంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 500 మంది సంపన్నుల నెట్ వర్త్ ఒక్కరోజే సుమారు 185 బిలియన్ డాలర్లు (రూ. 17.48 లక్షల కోట్లు) క్షీణించింది. 2012 తర్వాత ఒక్కరోజులో నమోదైన 14వ అతిపెద్ద పతనం ఇది.

Also Read : ఇజ్రాయెల్ పగ్గాలు ఐసెంకోట్ చేతికి వస్తే: ఇండియా పరిస్థితి ఏంటి?

మస్క్‌కు భారీ షాక్.. పడిపోయిన నెట్ వర్త్

ఎన్నికల ఫలితాల దెబ్బ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై తీవ్రంగా పడింది. ఆయన సంపద ఒక్కరోజే దాదాపు 79.7 బిలియన్ డాలర్లు (రూ. 7.53 లక్షల కోట్లు) తగ్గింది. మస్క్ రిపబ్లికన్ పార్టీకి ఓపెన్‌గా సపోర్ట్ చేయడంతో, ఇప్పుడు డెమోక్రాట్ల పాలనలో టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థలపై కఠిన నిబంధనలు వస్తాయన్న భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్పేస్‌ఎక్స్ షేర్లు 9 శాతం పడిపోయాయి. ప్రస్తుతం మస్క్ సంపద 800 బిలియన్ డాలర్ల మార్క్ కంటే దిగువకు చేరి, 785 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఒరాకిల్ కో-ఫౌండర్ లారీ ఎల్లిసన్ సైతం దాదాపు రూ. 95,400 కోట్లు కోల్పోయారు.

టాప్-10 నుంచి ఔటైన ఎన్విడియా సీఈఓ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని లీడ్ చేస్తున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద 15.1 బిలియన్ డాలర్లు (రూ. 1.43 లక్షల కోట్లు) పతనమైంది. దీంతో ఆయన సంపద 150.9 బిలియన్ డాలర్లకు పడిపోయి, టాప్-10 జాబితా నుంచి నేరుగా 13వ స్థానానికి చేరారు. ఆయన స్థానాన్ని వాల్‌మార్ట్ అధినేత జిమ్ వాల్టన్ (155 బిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు.

Also Read : 5వేల కోట్ల ఆస్తి వివాదం.. కోర్టు మెట్లెక్కిన మైఖేల్ జాక్సన్ కూతురు

టెక్ స్టాక్స్ ఎందుకు క్రాష్ అయ్యాయి?

డెమోక్రాట్ల విజయంతో బిగ్ టెక్ కంపెనీలు, AI ఇండస్ట్రీ మరియు భారీ డేటా సెంటర్లపై కఠిన రెగ్యులేషన్స్, నిబంధనలు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డేటా సెంటర్ల విస్తరణపై ఆంక్షలు వస్తే చిప్ డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనలతో ఎన్విడియా షేర్లు ఏకంగా 9.3 శాతం, ఒరాకిల్ షేర్లు 6.9 శాతం నష్టపోయాయి.