Kalki Bhagavan : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూశారు. గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ఆయన కుమారుడు కృష్ణాజీతో పాటు ఆశ్రమానికి చెందిన దాసాజీలు, ఇతర ప్రతినిధులు ఆసుపత్రి వద్ద ఉన్నారు.

కల్కి భగవాన్ పార్థివదేహాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లిలోని ఏకం ఆలయానికి తీసుకురానున్నారు. అక్కడ భక్తుల సందర్శన కోసం పార్థివదేహాన్ని ఉంచనున్నారు. మూడు రోజుల పాటు భక్తులు ఆయనను చివరిసారి చూసుకునే అవకాశం కల్పించనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.

Also Read : ట్రంప్ ప్రభుత్వాన్ని దించండి.. అమెరికన్లకు ఇరాన్ సంచలన లేఖ!

ఏకం ఆలయంలోనే కల్కి భగవాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు.. అక్కడే ఆయన సమాధిని నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. ఏకం ఆలయాన్ని భారీ ఖర్చుతో పాలరాతితో నిర్మించారు. కల్కి భగవాన్ తన సతీమణి అమ్మభగవాన్‌తో కలిసి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో భక్తులు ఉన్నారు.

కల్కి భగవాన్ అసలు పేరు విజయ్‌కుమార్. ఆయన కొంతకాలం ఎల్‌ఐసీ ఏజెంటుగా, టీచర్ గా పనిచేశారు. 1992లో తాను కల్కి అవతారమని చెప్పుకుంటూ కల్కి భగవాన్ పేరుతో ఆధ్యాత్మిక బోధనలు మొదలుపెట్టారు. మొదట కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని నేమం ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వరదయ్యపాళెం పంచాయతీ పరిధిలోని గోవర్ధనపురంలో కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్టు పేరుతో కార్యకలాపాలు ప్రారంభించారు.

ఆయన ఆశ్రమాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చేవారు. వారికి ధ్యానం, ముక్తి దీక్ష వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. కల్కి గ్రామీణాభివృద్ధి, వన్నెస్ హ్యూమన్, లోకా ఫౌండేషన్, ముక్తి వంటి పేర్లతో పలు ట్రస్టులను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు చేపట్టారు.

Also Read : ఇబ్రహీంపట్నం మహిళ హత్య మిస్టరీ వీడింది.. ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.