Visakhapatnam Airport : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక అంతర్జాతీయ విమానాలకు అతిథ్యం ఇచ్చిన విశాఖపట్నం విమానాశ్రయం సేవలు ఈ అర్థరాత్రి నుంచి ముగియనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విమాన రాకపోకలకు సిద్దమైంది. ఆగస్టు 17 నుంచి ఇక్కడి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ విమానాలను నిలిపేస్తున్నట్లు పౌరవిమానయానశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

దాదాపు 30 ఏళ్లపాటు సేవలందించిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ (ఐఎన్‌ఎస్‌ డేగ) సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నుంచి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్కడి నుంచి యథావిధిగా నడుస్తాయని తేల్చి చెప్పింది… నాన్‌షెడ్యూల్డ్‌ వాణిజ్య కార్యకలాపాలూ కూడా ఈ విమానశ్రయం నుంచి కొనసాగుతాయని వెల్లడించింది. ఇంత వరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు ఉన్న అంతర్జాతీయ ట్రావెల్‌కోడ్‌ ‘వీటీజెడ్‌’ ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అవుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక భోగాపురం విమానశ్రయం నుంచి తొలిసారి ఒక అంతర్జాతీయ విమానం బయలు దేరుతుందని భావించారు. అందులో భాగంగా సింగపూర్‌కు తొలి విమానం ఈనెల 16న బయలుదేరుతుందని భావించారు కానీ, ఇతర కారణాల వల్ల 16న కాకుండా ఈనెల 17న ఉదయం సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటికే భోగాపురం నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతికి ఇండిగో విమానయాన సంస్థ తొలి రోజు 31 సర్వీసులు నడపడానికి సిద్ధమైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలపై విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ నెల 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సేవలు రద్దు అవనుండగా.. అక్కడి నుంచి సేవలందించే విమానాలన్నీ భోగాపురం నుంచి బయలు దేరుతాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.