
Fire Accident : కోల్కతాలోని మిర్జా గాలిబ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భయానక ఘటనలో కనీసం 9 మంది బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు వచ్చిన రోగులు, వారి సహాయకులని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో గదుల్లో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. హోటల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసి, మంటలను అదుపులోకి తెచ్చారు.
గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, ఏసీ పేలడం లేదా షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సరుకులు, భవనాలు దట్టంగా ఉండే పాతబడిన ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. హోటల్ భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలపై కూడా తనిఖీలు చేపడుతున్నారు.









