West Bengal :  పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యక్తిగత విషయాలపై భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో జహంగీర్ ఆలం, అతని భార్య రుక్సానా బేగమ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేకపోయిన జహంగీర్, తన భార్యపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన తండ్రిని, తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన జహంగీర్ తల్లిపై కూడా అతను దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన తల్లి ఎలాగోలా ప్రాణాలతో ఇంటి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇళ్లలో నుంచి కేకలు వినిపించడంతో చుట్టుపక్కల స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే, అప్పటికే తీవ్ర గాయాలపాలైన రుక్సానా మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం జహంగీర్ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత తాను హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధంతో నేరుగా ధూప్‌గురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు,స్థానికుల వివరాల ప్రకారం.. జహంగీర్, రుక్సానాల వివాహం సుమారు మూడేళ్ల క్రితం జరిగింది. వీరికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. మొదట్లో వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ, గడిచిన కొద్దికాలంగా ఇద్దరి మధ్య గొడవలు సర్వసాధారణమయ్యాయని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. జహంగీర్ ఏదో వ్యసనానికి బానిసయ్యాడని, మత్తులో తరచూ ఇంట్లో గొడవలు సృష్టిస్తూ భార్యను వేధించడంతో పాటు ఇరుగుపొరుగువారిని కూడా బెదిరించేవాడని వారు ఆరోపించారు.

మృతురాలు రుక్సానా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, గాయపడిన జహంగీర్ తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గస్తీ బృందాన్ని మోహరించారు. ఈ దారుణానికి అసలు కారణం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.