
California : అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కాలిఫోర్నియాలోని తన ఇంటి దగ్గర నుంచి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తన భార్యను తీసుకెళ్లారని ఆమె భర్త పోలీసులకు చెప్పాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె కాల్చి చంపిన తర్వాత పాతిపెట్టిన స్థితిలో కనిపించింది. ఇప్పుడు అదే భర్తపై హత్య కేసు నమోదైంది. మృతురాలిని 30 ఏళ్ల జాస్మిన్ గిల్‌గా గుర్తించారు. ఆమె నర్స్‌గా పనిచేస్తోంది. ఎనిమిది నెలల చిన్నారికి తల్లి. ఆమె భర్త గురిందర్ గిల్ వయసు 28 ఏళ్లు. జాస్మిన్ హత్య కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 4న జాస్మిన్ కనిపించడం లేదంటూ ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు అక్టోబర్ 1న ఆమె చివరిసారిగా కనిపించింది.
Also Read : స్వర్గం పేరుతో 190 మంది ఆకలి చావులు.. చర్చ్‌లో 400 శవాలు
జాస్మిన్, గురిందర్ ఇద్దరూ విడాకుల కోసం కోర్టులో కేసు పెట్టుకున్నారు. తమ ఎనిమిది నెలల బిడ్డ ఎవరి దగ్గర ఉండాలనే విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ సమయంలోనే జాస్మిన్ కనిపించకుండా పోయింది. జాస్మిన్ కోసం పోలీసులు వెతుకుతున్న సమయంలో గురిందర్ ఓ కీలక విషయం చెప్పాడు. తమ ఇంటి దగ్గర మెయిల్ తీసుకుంటున్న సమయంలో ICE అధికారులు వచ్చి తన భార్యను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ICE అధికారులను సంప్రదించారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ఇంటి దగ్గర ఎలాంటి ఇమ్మిగ్రేషన్ చర్యలు జరగలేదని అధికారులు చెప్పారు. దీంతో గురిందర్ చెప్పిన విషయాలపై పోలీసులకు అనుమానం వచ్చింది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అతడు చెప్పిన మాటల్లో చాలా తేడాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో అక్టోబర్ 1న పోలీసులు మరో షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. పక్కనే ఉన్న ఎల్ డొరాడో కౌంటీలో కాల్చి పాతిపెట్టిన మనిషి మృతదేహం బయటపడింది. ఈ ప్రాంతం జాస్మిన్, గురిందర్ ఇంటికి సుమారు 70 మైళ్ల దూరంలో ఉంది. ఆ మృతదేహాన్ని పరీక్షించిన తర్వాత అది జాస్మిన్దేనని పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 14న గురిందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సంబంధం ఉన్న రెండు ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. ప్రస్తుతం అతడు బెయిల్ లేకుండా జైల్లో ఉన్నాడు. జాస్మిన్ భారత్‌లో పుట్టింది. ఆమె తల్లి ఇప్పటికీ భారత్‌లోనే ఉంటున్నారు. తన తల్లి బాటలో నడిచి జాస్మిన్ నర్స్‌గా మారింది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు.
జాస్మిన్ మృతదేహాన్ని అమెరికా నుంచి భారత్‌లో ఉన్న ఆమె తల్లి వద్దకు తీసుకురావడానికి, అలాగే ఆమె చిన్నారికి సహాయం చేయడానికి ఓ GoFundMe పేజీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 21 వేల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి. తన కోసం, తన బిడ్డ కోసం మంచి భవిష్యత్తు కావాలని జాస్మిన్ ఎంతో కష్టపడింది. కానీ ఆ భవిష్యత్తును నిర్మించుకునేలోపే ఆమె హత్యకు గురైంది. తాను కాపాడాలని ప్రయత్నించిన తన చిన్నారిని ఒంటరిగా వదిలి వెళ్లిపోయింది అని ఆ విరాళాల పేజీలో పేర్కొన్నారు.
Also Read : భార్య తల నరికి దేవుని ఆలయంలో పడేసిన భర్త.. ఆపై తండ్రి హత్య.. కారణం తెలిస్తే షాకే..!









