
Karnataka Car Blast : కర్ణాటకలో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిపై కత్తితో దాడి చేసి, అనంతరం కారులో బాంబు పేల్చిన ఘోర ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ భయానక ఘటనలో సదరు ప్రియుడు కారులోనే సజీవ దహనం అవ్వగా, ప్రియురాలు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. తుమకూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది.
పోలీసులు , జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తర కర్ణాటకలోని అంకోలాకు చెందిన నాగేంద్ర (30), బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రమ్యా ఉల్లాస్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల నాగేంద్రను పెళ్లి చేసుకునేందుకు రమ్య నిరాకరించడమే కాకుండా, అతని వేధింపులు తట్టుకోలేక నాగేంద్ర ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నాగేంద్ర, శనివారం బెంగళూరులోని ఆమె హాస్టల్ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. రమ్యను కత్తితో బెదిరించి, బలవంతంగా ఒక అద్దె కారు (క్యాబ్) ఎక్కించి అంకోలా వైపు ప్రయాణమయ్యాడు.
ఈ క్రమంలో రమ్య స్నేహితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కారు నంబర్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. పోలీసుల ఫోన్ సంభాషణను విన్న నాగేంద్ర ఒక్కసారిగా తీవ్ర అగ్రహానికి లోనయ్యాడు. “నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం” అంటూ తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్యపై దాడికి తెగబడ్డాడు. అంతేకాకుండా, నాగేంద్ర వద్ద బాంబు కూడా ఉందని రమ్య గట్టిగా కేకలు వేస్తూ డ్రైవర్ ప్రవీణ్‌ను హెచ్చరించింది.
పరిస్థితి చేదాటిపోతోందని గమనించిన డ్రైవర్ ప్రవీణ్ వెంటనే కారును రోడ్డు పక్కన నిలిపివేసి కిందికి దూకేశాడు. అదే సమయంలో రమ్య కూడా తీవ్ర గాయాలతో కారులో నుంచి కిందకు దూకేసింది. కానీ, నాగేంద్ర తన జేబులో తెచ్చుకున్న పెట్రోల్ బాంబును (నాటు బాంబు) కారులోనే డిటోనేట్ చేయడంతో (విసిరేయడంతో) క్షణాల వ్యవధిలో కారులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నాగేంద్ర కారులోనే చిక్కుకుపోయి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రవీణ్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం కత్తిపోట్లతో గాయపడిన రమ్య స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతుండగా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.









