
Punjab : డ్రగ్స్ అమ్ముతున్నాడని ఓ మెడికల్ షాపు యజమానిని నిలదీసిన ఉద్యమకారుడు. చివరికి అతడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో షాపు యజమాని తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన పంజాబ్లోని మాన్సాలో మంగళవారం జరిగింది.
మృతుడిని పర్వీందర్ సింగ్ ఝోటాగా గుర్తించారు. మెడికల్ షాపుల్లో అక్రమంగా మందులు అమ్ముతున్న వారిని ఆయన బయటపెడుతుండేవాడు. ఈ క్రమంలో ఓ షాపు యజమాని డ్రగ్స్ అమ్ముతున్నాడని ఆరోపిస్తూ.. అతడిని ప్రశ్నించాడు. ఈ ఘటనను తన ఫేస్బుక్లో లైవ్ కూడా పెట్టాడు. దాదాపు ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఝోటా ఓ వృద్ధుడితో కలిసి మెడికల్ షాపు ముందు కనిపించాడు. ఆ వృద్ధుడు షాపులో డ్రగ్స్ కొన్నాడని ఝోటా చెప్పాడు. దీంతో షాపు యజమానికి, అతడికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ సమయంలో యజమాని చేతిలో తుపాకీ ఉంది.
వాగ్వాదం జరుగుతుండగా ఝోటా.. నన్ను చంపేయ్.. నన్ను చంపేయ్ అంటూ యజమానితో అన్నాడు. నీ దగ్గర తుపాకీ ఎందుకు ఉందని కూడా ప్రశ్నించాడు. పోలీసులకు ఫోన్ చేయాలని, మరికొంతమందిని అక్కడికి పిలవాలని తనవాళ్లకు చెప్పాడు. షాపులోని సీసీటీవీ వీడియో చూపించాలని కూడా యజమానిని అడిగాడు. దీంతో యజమాని ఆ వృద్ధుడిని.. తన దగ్గర డ్రగ్స్ తీసుకున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి ఝోటా స్పందిస్తూ.. అవును, దానికి సంబంధించిన వీడియో మా దగ్గర ఉంది అని చెప్పాడు.
ఇలా దాదాపు నాలుగు నిమిషాల పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి షాపు యజమాని తుపాకీతో కాల్పులు జరపడంతో ఝోటా ప్రాణాలు కోల్పోయాడు.









