Shabad :  షాబాద్‌ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి సామూహిక హత్యలు తీవ్రంగా కుదిపేస్తున్నాయి. నిందితుడు రాజ్‌కుమార్‌ జరిపిన ఈ మారణహోమంలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. ఎలాంటి పాపం ఎరుగని తన మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని కూడా గొంతుకోసి బెడ్‌ రూమ్‌లోనే రక్తపు మడుగులో చంపేయడం. అసలు తన కన్నపిల్లలను రాజ్‌కుమార్‌ ఎందుకు అంత కిరాతకంగా చంపేశాడు అనే కోణంలో దర్యాప్తు చేయగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

రాజ్‌కుమార్‌ ఏడేళ్ల క్రితం సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి ఊరికే చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించడంతో అతనిపై మే 16న పోక్సో కేసు నమోదైంది. కేవలం 10 రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్‌పై అతని భార్య సరిత తీవ్ర అసహ్యం పెంచుకుంది. పరాయి అమ్మాయిని వేధించి పోక్సో కేసులో జైలుకు వెళ్లొచ్చిన భర్తను ఆమె పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టింది. అంతేకాదు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని తన పిల్లల దగ్గరకు రానివ్వకూడదని, వారిని పూర్తిగా దూరం పెట్టాలని సరిత నిర్ణయించుకుంది. ఈ విషయమే రాజ్‌కుమార్‌కు తీవ్ర అహంకారాన్ని, కక్షను పెంచింది. తన తప్పును తెలుసుకోకుండా, భార్య తనను తృణీకరించడం, పిల్లలను తనకు కాకుండా దూరం చేస్తోందనే విపరీతమైన కోపంతోనే భార్యతో పాటు ఆ ఇద్దరు పసిపిల్లలను కూడా చంపేయాలని ఫిక్స్ అయ్యాడు.

Also Read : షాబాద్‌ మర్డర్ కేసులో సంచలనాలు.. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి

శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బాధిత బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, గొంతుకోసి చంపిన అనంతరం.. మళ్లీ ఆమె ఇంటికి వచ్చి ఇద్దరు మహిళలను నరికి చంపాడు. ఆ తర్వాత నేరుగా తన ఇంటికి వెళ్లాడు. క్రూరమృగంలా మారిన రాజ్‌కుమార్.. ఇంటికి వెళ్లే ముందు భార్య సరితకు ఫోన్‌ చేసి, నాకు పిల్లలను చూడాలని ఉంది అని చాలా సాఫ్ట్‌గా చెప్పాడు. భర్త ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని తెలియని సరిత, పిల్లలపై ప్రేమతోనే వచ్చాడనుకుని ఎలాంటి అనుమానం లేకుండా తలుపు తీసింది.

ఇంట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. భార్యపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకోవడానికి ఆమె బయటకు పరిగెత్తినా వెంబడించి మరీ నరికి చంపాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి బెడ్‌పై నిద్రపోతున్న తన మూడేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకును కూడా వదలకుండా గొంతుకోసి కిరాతకంగా చంపేశాడు. తనను భార్య అసహ్యించుకుందనే కక్ష, ఎలాగూ పిల్లలను తన దగ్గరకు రానివ్వదనే రాక్షస ఆలోచనతోనే నిద్రలో ఉన్న ఆ చిన్నారుల ప్రాణాలను సైతం తీసేశాడు.

ఆరుగురిని హతమార్చిన అనంతరం రాజ్‌కుమార్‌ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. ఆరుగురిని చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కారులో పరారమయ్యాడు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ సైకో కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Also Read : పచ్చని పందిట్లో ‘వధూ’ రూపంలో కాలనాగు..ప్రియుడితో కలసి నవవరుడి దారణహత్య

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.