ఉత్తరప్రదేశ్‌లో ఓ మర్డర్ కేసు నిందితుడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఏకంగా తన చావునే నాటకంగా మార్చాడు. ఏఐతో తయారు చేసిన ఫొటో, నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో తాను చనిపోయినట్లు నమ్మించాడు. చివరికి తన స్థానంలో మేకను చితిపై పెట్టి దహనం చేయించినట్లు పోలీసులు తెలిపారు. మౌ జిల్లాకు చెందిన 38 ఏళ్ల రాజ్‌కుమార్ రాజ్‌భర్ అలియాస్ రాజు ఈ ప్లాన్ చేసినట్లు పోలీసులు చెప్పారు. 2016లో యోగేశ్ సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో రాజ్‌కుమార్, అతడి సహచరుడు సుదర్శన్ రాజ్‌భర్ నిందితులుగా ఉన్నారు. కేసు విచారణ చివరి దశకు చేరుకోవడంతో తనకు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని రాజ్‌కుమార్ భయపడ్డాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రకారం.. రాజ్‌కుమార్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ వ్యాపారం చేసేవాడు. పలువురి నుంచి పెట్టుబడుల కోసం డబ్బులు కూడా తీసుకున్నాడు. అతడి దగ్గర పెట్టుబడి పెట్టిన ఇద్దరు హోమియోపతి వైద్యులు అతడిని చనిపోయినట్లు నాటకం ఆడాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా రాజ్‌కుమార్‌ను స్పృహలో లేనట్లు చూపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడిని శ్మశాన వాటికకు తీసుకెళ్లి చితిపై పడుకోబెట్టారు. అతను చితిపై ఉన్నట్లు కనిపించేలా ఏఐతో ఫొటోను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత ఘాజీపూర్‌లో అంత్యక్రియలు జరుగుతున్నట్లు నమ్మించారు. చితిపై ఉన్న రాజ్‌కుమార్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లి, అతడి స్థానంలో మేకను పెట్టి దహనం చేశారు. అనంతరం ఘాజీపూర్‌లో అతడి పేరుతో డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించి సుమారు 18 నెలల పాటు పోలీసులకు దొరకకుండా తిరిగాడు. అయితే పోలీసులు అతడిపై నిఘా కొనసాగించారు. చివరకు ఆదివారం మౌలో రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.

ఈ విషయం బయటపడటంతో పోలీసులు అతడిపై నకిలీ పత్రాలు తయారు చేయడం, మోసం వంటి ఆరోపణలతో మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని జైలుకు పంపనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే 2016 హత్య కేసులో రాజ్‌కుమార్‌పై ఉన్న ఆరోపణలు, తన చావును నాటకంగా మార్చిన కేసు రెండూ ప్రస్తుతం చట్టపరమైన విచారణలోనే ఉన్నాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.