Actress Radha : సీనియర్ నటి రాధా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి, నటి అంబికా నాయర్, సోదరుడు అర్జున్ నాయర్ కలిసి తనకు చెందిన రూ.50 కోట్లకు పైగా విలువైన చెక్కులను నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. చెన్నై వలసరవాక్కంలో ఉన్న తన ఇంట్లో వ్యాపార అవసరాల కోసం కొన్ని సంతకం చేసిన ఖాళీ చెక్కులను ఉంచేవారినని రాధా చెప్పారు. ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, పన్నులు, ఇంటి ఖర్చులు వంటి వాటికి వాటిని ఉపయోగించేవారినని తెలిపారు.

తాను తరచూ కేరళ, ముంబై, బెంగళూరుకు వెళ్తుంటానని రాధా చెప్పారు. తన సోదరి అంబికా కూడా అదే ఇంట్లో ఉండటంతో తన గదిలోకి ఆమెకు వెళ్లే అవకాశం ఉండేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పొరూర్‌లో ఉన్న ‘ఆర్.ఆర్. గార్డెన్’ వ్యాపారానికి సంబంధించిన పాత చెక్కుల విషయంలోనే ఈ సమస్య వచ్చినట్లు రాధా తెలిపారు. గతంలో ఈ వ్యాపారం ‘ఏఆర్‌ఎస్ గార్డెన్ స్టూడియో’ పేరుతో ఉండేదని చెప్పారు. 2025 జనవరి 7న దాని పేరును ‘ఆర్.ఆర్. గార్డెన్’గా మార్చామని, జనవరి 22 నుంచి కొత్త చెక్‌బుక్‌ను ఉపయోగిస్తున్నామని బ్యాంకుకు కూడా చెప్పినట్లు తెలిపారు.

Also Read : వెల్‌కమ్ బేబీ గర్ల్.. దీపిక, రణ్‌వీర్ ఇంట్లోకి మరో మహాలక్ష్మి!

అయితే సెప్టెంబర్ 17న ఐడీబీఐ బ్యాంక్ నుంచి రాధాకు ఒక మెయిల్ వచ్చింది. తన సోదరి అంబికా నాయర్ పేరుతో పాత చెక్కులను భారీ మొత్తాలకు సమర్పించినట్లు బ్యాంకు నుంచి సమాచారం అందిందని ఆమె చెప్పారు. మొత్తం ఐదు చెక్కులు సమర్పించారని రాధా తెలిపారు. వాటి విలువలు రూ.11 లక్షలు, రూ.13.17 కోట్లు, రూ.27.73 కోట్లు, రూ.7 కోట్లు, రూ.1.79 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. మొత్తం రూ.50.8 కోట్ల విలువైన చెక్కులని ఆమె పేర్కొన్నారు.

బ్యాంకు నుంచి విషయం తెలిసిన వెంటనే లావాదేవీలు ఆపాలని కోరినట్లు రాధా చెప్పారు. చెక్కులపై పేరు, డబ్బు, తేదీ వంటి వివరాలను తన సోదరుడు అర్జున్ నాయర్ రాశారని ఆమె ఆరోపించారు. అర్జున్ నాయర్‌పై ఫెమా కేసులు ఉన్నాయని, కోర్టు ఆదేశాల మేరకు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉందని కూడా రాధా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇవి రాధా చేసిన ఆరోపణలు మాత్రమే.

తన సోదరి, సోదరులకు తాను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని రాధా చెప్పారు. తనకు తెలియకుండా గదిలోకి వెళ్లి సంతకం చేసిన ఖాళీ చెక్కులు తీసుకెళ్లి వాటితో డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాదు, తన గదిలో ఉన్న బంగారం, వజ్రాల నగలు, ఆస్తి పత్రాలను కూడా తాను చూసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే తన సోదరి అంబికా, సోదరుడు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని నటి రాధా పోలీసులను కోరారు.

Also Read : సైమా అవార్డ్స్‌ 2026: ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేశ్‌

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.