
భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ సీనియర్ నటుడు నానా పటేకర్ (Nana Patekar) 75 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన.. గోవాలోని తన నివాసంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడు మల్హర్ పటేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రికి గుండెనొప్పి రావడంతో వెంటనే సమీపంలోని మణిపాల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లామన్నారు. కానీ అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారని తెలిపారు. కాగా ఆయనను బతికించడానికి సుమారు 45 నిమిషాల పాటు నిరంతరంగా CPR చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.
Also Read : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం
నానా పటేకర్ (Nana Patekar) జననం
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆయన మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా మురుద్-జింజీరాలో 1951 జనవరి 1న జన్మించారు. ముంబైలో డిగ్రీ పూర్తి చేసిన నానా పటేకర్.. ఆ తర్వాత యాక్టింగ్ పై ఉన్న అమితమైన ఇష్టంతో నాటకాల ద్వారా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇలా 1978లో వచ్చిన ‘గమన్’ సినిమాతో ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. ఒక్క బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మరాఠీ, తమిళ భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాలు
విలన్‌గా, సహాయ నటుడిగా, హీరోగా.. ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయేవారు. ఇక తన మొదటి సినిమా తర్వాత.. పరిందా, క్రాంతివీర్, అగ్నిసాక్షి, ఖమోషీ: ది మ్యూజికల్, అబ్ తక్ ఛప్పన్, నట సామ్రాట్ వంటి సినిమాలు ఆయన జీవితాన్నే మార్చేశాయి. ముఖ్యంగా ఆయన మరాఠీ సినిమా నటసామ్రాట్‌లో పటేకర్ నటన ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇటీవల కాలంలో ఆయన నటించిన చివరి సినిమా ‘సుబేదార్ (2026)’. ఈ మూవీలో కూడా ఆయన తన యాక్టింగ్‌తో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు.
నానా పటేకర్ ఫ్యామిలీ
నానా పటేకర్ 1978లో మరాఠీ నటి నీలకాంతి పటేకర్‌ను పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ అభిప్రాయబేధాల వల్ల విడివిడిగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు దుర్వాస, మల్హర్. వీరిలో మొదటి కుమారుడు దుర్వాస రెండేళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ఘటన పటేకర్ జీవితంలో అతిపెద్ద విషాదంగా మిగిలిపోయింది. ఇక రెండో కుమారుడు మల్హర్ పటేకర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.
Also Read : వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ దూకుడు.. మూడో రోజు కూడా భారీగా బుకింగ్స్!
నానా పటేకర్ అవార్డులు
నానా పటేకర్ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకుగానూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అందులో మూడు నేషనల్ అవార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఒక పద్మశ్రీ పురస్కారం ఉన్నాయి. పరిందా సినిమాలో ఉత్తమ సహాయ నటుడిగా, క్రాంతివీర్ మూవీలో ఉత్తమ నటుడిగా, అగ్నిసాక్షి మూవీలో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే పరిందా, అంగారక్, క్రాంతివీర్, అపహరణ్, నట సామ్రాట్ సినిమాలకు పలు కేటగిరీల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఇవి కాకుండా ఆయన 2013లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుని మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
నానా పటేకర్ ‘నామ్ ఫౌండేషన్’
నానా పటేకర్ కేవలం తెరమీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా రియల్ హీరోగా నిలిచారు. మరో నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి నామ్ ఫౌండేషన్ (Naam Foundation) ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం.. మహారాష్ట్రలో కరువు, తీవ్ర వర్షప్రభావంతో ఇబ్బందిపడుతున్న వేలాది మంది రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే. ఇలా భారతీయ సినీ చరిత్రలో నానా పటేకర్ అందించిన సేవలు గుర్తుండిపోతాయి.









