
Puneeth Rajkumar : కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి ఐదేళ్లు అవుతున్నా.. ఆయన మరణం అభిమానులను ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. తాజాగా పునీత్‌కు చికిత్స అందించిన డాక్టర్ రమణ రావు, ఆయన చనిపోవడానికి ముందు జరిగిన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జిమ్‌లో కిక్‌బాక్సింగ్ చేసిన తర్వాత పునీత్ తన క్లినిక్‌కు వచ్చారని, ఆయన పరిస్థితిని చూసి వెంటనే ఈసీజీ పరీక్ష చేయగా గుండెపై ఒత్తిడి ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.
పునీత్ మరణించిన రోజు ఏం జరిగిందో వివరిస్తూ.. ఆయన జిమ్‌లో సుమారు గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేసి తన క్లినిక్‌కు వచ్చారని డాక్టర్ రమణ రావు చెప్పారు. ఆ రోజు పునీత్ మొదటిసారిగా కిక్‌బాక్సింగ్ ప్రయత్నించారని, వచ్చినప్పుడు చాలా అలసిపోయి, విపరీతంగా చెమటలు పడుతూ కనిపించారని తెలిపారు. అప్పు నా క్లినిక్‌కు వచ్చినప్పుడు చాలా చెమటలు పడుతున్నాయి. జిమ్‌లో గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేశానని చెప్పారు. ఆ రోజు మొదటిసారి ఆ వ్యాయామం చేశారు. ఆయన పరిస్థితిని చూసి ఏదో సమస్య ఉందని అనిపించింది. వెంటనే ఈసీజీ పరీక్ష చేశాను. అందులో గుండెపై ఒత్తిడి ఉన్నట్లు కనిపించింది అని డాక్టర్ గుర్తు చేసుకున్నారు. ఈసీజీ ఫలితాలు చూసిన వెంటనే పునీత్‌కు మందులు ఇచ్చి, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అప్పటికి గుండెపోటు రాలేదని, అయితే గుండెపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తించానని వివరించారు.
పునీత్‌ను ఆస్పత్రికి తరలించే సమయంలో ఆయన స్పృహలోనే ఉన్నారని, చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూనే ఉన్నారని డాక్టర్ తెలిపారు. తన కారులోనే ఆస్పత్రికి బయలుదేరిన పునీత్, కూర్చోవడానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే, ఆయన భార్య అశ్విని ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించానని, డ్రైవర్‌ను వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరానని తెలిపారు. మరోవైపు డాక్టర్ రంగనాయక్ ఆస్పత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రికి చేరుకోవడానికి సరిగ్గా ఒక నిమిషం ముందు ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆస్పత్రిలోకి తీసుకెళ్లే సమయానికి గుండె కొట్టుకోవడం లేదు అని డాక్టర్ రమణ రావు ఆవేదనగా చెప్పారు. విక్రమ్ ఆస్పత్రిలో వైద్యులు పునీత్‌ను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. అది మా అందరికీ చాలా బాధాకరమైన క్షణం. సొంత కొడుకును కోల్పోయినట్లుగా అనిపించింది అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
అభిమానులు ప్రేమగా అప్పు అని పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్ 29న, 46 ఏళ్ల వయసులో గుండె ఆగిపోవడంతో మరణించారు. ఆయనను వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యులు ప్రాణాలు కాపాడలేకపోయారు.









